- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ సెక్యూరిటీ ఏజెన్సీలు... కరీంనగర్‌లో ఏడు సంస్థలపై కేసులు నమోదు
రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా, చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌లు లేకుండా అక్రమంగా కొనసాగుతున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం నిబంధనలను బేఖాతరు చేస్తున్న సంస్థల ఏరివేతకు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ సిద్ధమైంది.

దిశ,తెలంగాణ బ్యరో: రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా, చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌లు లేకుండా అక్రమంగా కొనసాగుతున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం నిబంధనలను బేఖాతరు చేస్తున్న సంస్థల ఏరివేతకు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ సిద్ధమైంది. ఇందులో భాగంగా, ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్, ఓఎస్‌డీ వి.బి. కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు కరీంనగర్ పోలీసులు జిల్లాలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న ఏడు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై ఇప్పటికే కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
షోకాజ్ నోటీసులు ఇచ్చినా బేఖాతరు..
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న ఏజెన్సీలకు పోలీసులు గతంలోనే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే, ఆయా సంస్థల నిర్వాహకులు పోలీసులకు ఎటువంటి వివరణ అందించకపోవడంతో చట్టపరమైన చర్యలు చేపట్టారు. కరీంనగర్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ ల కింద ఏడు ఏజెన్సీలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
శిక్షలు తప్పవు..కమలాసన్ రెడ్డి..
ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నిర్వహణకు సంబంధించి చట్టబద్ధమైన పీఎస్ఏఆర్ఏ లైసెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి అని కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు. లైసెన్స్ లేకుండా ఏజెన్సీలు నిర్వహించడం నేరమని, నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులకు ఏడాది వరకు జైలు శిక్ష లేదా రూ.25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. భద్రతా సిబ్బందిని నియమించుకునే క్రమంలో ఏజెన్సీలు కచ్చితమైన ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. ప్రతి సెక్యూరిటీ గార్డుకు తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ చేయించాలని, వారికి కనీసం 21 రోజుల పాటు ప్రాథమిక భద్రతా శిక్షణ అందించిన తర్వాతే విధుల్లోకి తీసుకోవాలని అన్నారు.కేవలం కరీంనగర్ మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అక్రమ ఏజెన్సీల గుర్తింపునకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
యజమానులు జాగ్రత్తగా ఉండాలి.. ఏడీజీ విజయ్ కుమార్..
వాణిజ్య సంస్థలు, పరిశ్రమల యజమానులకు ఏడీజీ విజయ్ కుమార్ పలు సూచనలు చేశారు. వ్యాపార సంస్థలు, పారిశ్రామిక వాడలు, ఇతర ప్రైవేట్ సంస్థల యజమానులు తమ భద్రత కోసం సిబ్బందిని తీసుకునే ముందు సదరు ఏజెన్సీకి ప్రభుత్వం గుర్తింపు పొందిన, చెల్లుబాటు అయ్యే పీఎస్ఏఆర్ఏ లైసెన్స్ ఉందో లేదో సరిచూసుకోవాలని కోరారు. లైసెన్స్ లేని ఏజెన్సీల నుంచి సేవలు పొందడం వల్ల భవిష్యత్తులో భద్రతా పరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, కేవలం గుర్తింపు పొందిన సంస్థలకే భద్రతా బాధ్యతలు అప్పగించాలని ఆయన సూచించారు.






