మేడిపల్లి ఈ-వేలం సక్సెస్: హెచ్ఎండీఏకు ఏకంగా రూ.120 కోట్ల ఆదాయం

by Kema Shiva Kumar |

హెచ్‌ఎండీఏ మేడిపల్లి లేఅవుట్ మూడో దశ ఈ-వేలానికి కస్టమర్ల నుంచి ఊహించని రెస్పాన్స్ లభించింది.

మేడిపల్లి ఈ-వేలం సక్సెస్: హెచ్ఎండీఏకు ఏకంగా రూ.120 కోట్ల ఆదాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో మేడిపల్లి లేఅవుట్‌లోని 68 నివాస ప్లాట్లకు నిర్వహించిన మూడో దశ ఈ-వేలం విజయవంతంగా పూర్తయింది. ఈ వేలానికి గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల నుండి విశేష స్పందన లభించింది. లేఅవుట్‌లోని మొత్తం 68 ప్లాట్లలో 63 ప్లాట్లను వేలం ద్వారా విక్రయించారు. ఈ వేలంలో గరిష్ఠంగా చదరపు గజానికి రూ.80 వేల బిడ్ దాఖలు కాగా, సగటు బిడ్ ధర చదరపు గజానికి రూ.56,260 గా నమోదైంది. ఈ వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు సుమారు రూ.120 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు.

మార్కెట్‌లో పెరిగిన విశ్వాసం..

గజానికి రూ.80 వేలు పలకడంతో మేడిపల్లి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ డిమాండ్ భారీగా ఉందని పలువురు బిడ్డర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బిడ్డర్లు పాల్గొనడం ద్వారా హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లపై మార్కెట్ విశ్వాసం బలంగా ఉందని స్పష్టమైంది. సక్రమమైన ప్రణాళికతో రూపొందించిన నివాస ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. పలు ప్లాట్ల కోసం అనేక బిడ్లు రావడంతో బిడ్డర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ విజయవంతమైన ఈ-వేలం హైదరాబాద్ తూర్పు అభివృద్ధి కారిడార్‌లో మౌలిక సదుపాయాల విస్తరణను, కొత్త పెట్టుబడులను మరింత వేగవంతం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Next Story