ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విత్తనాల విక్రయాలు..?

by Ratna Kumari |

కారేపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం అనుమతి లేని పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విత్తనాల విక్రయాలు..?
X

దిశ, కారేపల్లి : కారేపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం అనుమతి లేని పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు, హైదరాబాద్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కొంతమంది డీలర్లు స్థానికంగా ఉన్న కొందరితో కలిసి చీమలపాడు, భాగ్యనగర్ తండా మేకల తండా, మాదారం తదితర పరిసర ప్రాంతాల్లో రెండు వారాల నుంచి రైతులకు అనధికారిక బీటీ–3 పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారని సమాచారం.మండలంలో 24 విత్తన దుకాణాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలను మాత్రమే విక్రయిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, వాటితో పాటు అనుమతి లేని కంపెనీల విత్తనాలు కూడా రహస్యంగా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ అవి తూతూమంత్రంగానే జరుగుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వానికి ఏ కంపెనీల విత్తనాలు విక్రయించబడుతున్నాయో నివేదికలు సమర్పించినప్పటికీ,వాటిని పట్టించుకోకుండా వేరే విత్తనాలు విక్రయిస్తున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.తక్కువ ధరకు విత్తనాలు లభిస్తాయన్న ఆకర్షణతో రైతులను ప్రలోభపెట్టి బీటీ–3 విత్తనాలను విక్రయిస్తున్నారని తెలుస్తోంది.

బీటీ–3 పత్తి విత్తనాల వల్ల కలుపు సమస్య తగ్గుతుందని, కలుపు మందు పిచికారీ చేసిన మొక్కలకు హాని జరగదని,బలంగా ఉంటాయని నమ్మబలికి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు వస్తాయని ప్రచారం చేస్తూ రైతులను ఆకర్షిస్తున్నప్పటికీ, ఇవి దీర్ఘకాలంలో పంటలకు నష్టం కలిగించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. భూసారంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం కూడా ఉందని వారు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుమతి పొందిన విత్తనాలనే వినియోగించాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.అదే సమయంలో అనుమతి లేని విత్తనాల విక్రయాలపై సంబంధిత శాఖలు తక్షణ తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అనుమతి లేని విత్తనాల విక్రయాలపై నియంత్రణ లేకపోతే రైతులు భారీ నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

మండల వ్యవసాయ శాఖ అధికారి అశోక్ వివరణ..

వేరే ప్రాంతాల నుంచి ప్రభుత్వ అనుమతులు లేని విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మండల పరిధిలోని విత్తన దుకాణదారులు ప్రభుత్వం అనుమతించిన కంపెనీల విత్తనాలను మాత్రమే విక్రయించాలని తెలిపారు. అలా కాకుండా అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Next Story