హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల థ్రిల్లింగ్ ఛేజింగ్..

by Taduka Kalyani |

తల్లి మొబైల్ ఫోన్ లాక్కోవడంతో ముగ్గురు మైనర్ బాలికలు ఇంటి నుంచి పారిపోయిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల థ్రిల్లింగ్ ఛేజింగ్..
X

దిశ, సిటీక్రైమ్: తల్లి మొబైల్ ఫోన్ లాక్కోవడంతో ముగ్గురు మైనర్ బాలికలు ఇంటి నుంచి పారిపోయిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. బాలికలు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారి ఆచూకీని గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.

బెంగాల్‌కు వెళ్లాలని నిర్ణయం

మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు తమ తల్లి ఫోన్‌లో వీడియో గేమ్స్ ఆడుతుండేవారు. ఈ విషయం గమనించిన తల్లి ఫోన్‌ను తీసేసి వారిని మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలికలు ఇంట్లో నుంచి రూ.3 వేల నగదు తీసుకుని ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో బాలికలు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులను దర్యాప్తుకు ఆదేశించారు.

మెసేజ్‌తో దొరికిన క్లూ

దర్యాప్తులో భాగంగా పోలీసులు బాలికలు ఉపయోగించిన సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించారు. వీడియో గేమ్స్ ఆడే సమయంలో వారికి పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ యువకుడు పరిచయమైనట్లు గుర్తించారు. అతనితో ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేస్తున్నట్లు తేలింది. అయితే తల్లి ఫోన్ తీసేయడంతో బాలికల ఆచూకీ తెలుసుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ క్రమంలో ఆ యువకుడి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా, అతని స్నేహితుల ఖాతాలను కూడా పోలీసులు పరిశీలించారు. ఈ సమయంలో ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి యువకుడి స్నేహితుడికి “బెంగాల్‌కు వస్తున్నాం” అంటూ మెసేజ్ వెళ్లినట్లు గుర్తించారు. ఆ మెసేజ్ ఆధారంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేయగా, బాలికలు ఏలూరు మీదుగా వెళ్తున్న రైలులో ఉన్నట్లు తేలింది. వెంటనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు, రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో ఏలూరులో ముగ్గురు బాలికలను గుర్తించి సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు.

ఫోన్‌పై అధిక మోజే కారణం

విచారణలో బాలికలు మొబైల్ ఫోన్, సోషల్ మీడియాకు బాగా అలవాటు పడినట్లు తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడి మాటలను నమ్మి అతని వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. తల్లి ఫోన్ లాక్కోవడంతో కోపంతో ఈ నిర్ణయం తీసుకున్నారని పోలీసులు తెలిపారు. పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు నిరంతరం గమనించాలని, వారిపై కోపం చూపకుండా అవగాహన కల్పించాలని పోలీసులు సూచించారు. అలాగే చదువు, క్రీడలు మరియు ఇతర సృజనాత్మక కార్యక్రమాలపై ఆసక్తి పెంచేలా ప్రోత్సహించాలని, పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై కూడా తగిన పర్యవేక్షణ ఉండాలని కోరారు.

Next Story