మట్కాలో చక్రం తిప్పుతున్న బుకీ

by Ratna Kumari |

ఇంజనీరింగ్ విద్యను మధ్యలో ఆపేసిన యువకుడు... కోటీశ్వరుడు కావాలని అనుకున్నాడెమో.. ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది అంతే...

మట్కాలో చక్రం తిప్పుతున్న బుకీ
X

దిశ, కొత్తగూడెం ప్రతినిధి : ఇంజనీరింగ్ విద్యను మధ్యలో ఆపేసిన యువకుడు... కోటీశ్వరుడు కావాలని అనుకున్నాడెమో.. ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది అంతే... ఏదైనా బిజినెస్ చేస్తే సంవత్సరాలు కష్టపడితే తప్ప నిలదొక్కుకోలేము.. ఇతరుల నుండి పోటీ తట్టుకొని నిలదొక్కుకుంటే వేలరూపాయలే వస్తాయి. ఒకవేళ బిజినెస్ లో నిలదొక్కుకోలేకపోతే నష్టమే.. ఇదంతా కష్టమైన పని... అందుకే అక్రమదందా అయితే తక్కువ సమయంలో లక్షలు సంపాదించవచ్చు మాఫియా డాన్ గా ఎదగవచ్చు.. ఇదేదో బాగుంది అనుకున్నాడు. ఇంకేముంది పేద, మధ్యతరగతివారు, కొంతమంది అత్యాశపరులైన కిరాణదుకాణదారులు, చిరువ్యాపారులు తమకు అదనంగా నగదు సంపాదించడంపై ఇతర మార్గాలు ఏ విధంగా అన్వేషిస్తారో... తాను కూడా అదే విధంగా ఆలోచించి మట్కా (బ్రాకెట్) దందాలోకి దిగాడు.

ఇంకేముంది పట్టణంలోని కొంతమంది యువకులను చేరదీసి ఏజెంట్లుగా నియమించుకున్నాడు. కొత్తగూడెం మండలం నుంచి జిల్లా స్థాయికి ఎదిగి ఇప్పుడు రాష్ట్రం దాటి అక్రమదందాను యధేచ్ఛగా నిర్వహిస్తున్నాడు. అయితే అక్రమదందాలో ఇబ్బందులు తప్పవు. మాముళ్ళు ఇవ్వడాలు తప్పవు. అందుకు తనకు అనువుగా అప్పుడే ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన ఓ వ్యక్తిని తన పార్టనర్ గా చేర్చుకున్నాడు. ఆ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి నియోజకవర్గమంత కొట్టినపిండినే.. దీనికి తోడు ఆయనకు అన్నీ వర్గాలతో పాత పరిచయాలు.. ఇంకా తనకు ఎదురే లేదన్నట్లుగా నెంబర్ గేమ్ ను జిల్లాలో విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. తనకేం ఇబ్బందులు లేకుండా హాయిగా మట్కా దందాను మహాద్భుతంగా నడిపించేస్తున్నారు. అయితే వీరికి తోడుగా కార్పొరేటర్ బంధువు కూడా కొత్తగా ఈ దందాలో ప్రవేశించాడు. ఇక ప్రతీరోజు ఆరు ఆటలు... పన్నెండు నెంబర్లు... జేబుల నిండా కమిషన్లతో నిండిపోతోంది. ఇలా పేద, మధ్యతరగతి ప్రజలు, యువకుల నుంచి ప్రతీ రోజు వేలరూపాయలను కొల్లగొడుతూ అక్రమదందాలో బూడిదగడ్డ బుకీ, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కోట్ల రూపాయలను వెనకేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మమ్మల్నీ పట్టుకోండి చూద్దామంటున్న బుకీలు, ఏజెంట్లు

మట్కా దందా కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, చుంచుపల్లి, పాల్వంచ మండలాలతో పాటు జిల్లాలోని మిగిలిన మండలాల్లో విచ్చలవిడిగా కొనసాగుతోంది. జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు నిఘా విభాగం అధికారులు, సిబ్బంది గంజాయి, డ్రగ్స్, నిషేధిత మత్తుపదార్ధాల రవాణా, మావోయిస్టుల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించడం, వాటిపై ఉక్కుపాదం మోపడం, మరోవైపు పని ఒత్తిడి వల్ల మట్కా దందాపై ప్రత్యేక దృష్టి సారించకపోవడం మట్కాను నిర్వహించే బుకీలకు, ఏజెంట్లకు బాగా కలిసి వచ్చింది. దీనినే ఆసరాగా చేసుకున్న బుకీలు, ఏజెంట్లు గత పదిహేనేళ్ళుగా నాలుగైదు ఏరియాలకు ఒక ఏజెంట్ ను నియమించుకొని కలెక్షన్లు చేసి ఆటను నిరంతరాయంగా నడిపిస్తున్నారు. ఈ దందా నిర్వహణలో బుకీలు కోట్ల రూపాయలు వెనకేసుకొని ఆస్తులు, భూములు వెనకేసుకుంటే ఈ మట్కా ఆడేవారు ఆటకు బానిసై కుటుంబాలను రోడ్డునపడేసుకుంటున్నారు. ఈ బ్రాకెట్ నెంబర్ గేమ్ పై ఇటీవల 'దిశ' దినపత్రికలో ప్రచురితమైన వరుస కథనాలపై పోలీస్ నిఘా విభాగం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఆటను ఎవరు నిర్వహిస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి నగదు చేతులు మారుతున్నాయో తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ కథనాలపై రెండు రోజులు మౌనంగా ఉన్న త్రీ టౌన్ పోలీసులు ఆగమేఘాల మీద రంగంలోకి దిగి బుకీలను, ఏజెంట్లను వదిలివేసి ఆటను ఆడేవారిపై వేట మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో ఉన్న పాత పరిచయస్థులు బుకీలకు, ఏజెంట్లకు ముందుగానే సమాచారం ఇచ్చి వారు పట్టణం విడిచి వెళ్ళేలా ఆదేశించినట్లు ఇక వారిని వదిలివేసి, ఆట ఆడేవారిని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో త్రీటౌన్ పోలీస్ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి బుకీల విషయంలో కిందిస్థాయి సిబ్బంది తమ స్వామిభక్తిని చాటుకోవడం, బుకీలు ఊపిరిపీల్చుకోవడం జరిగిపోయాయని, ఇన్నిరోజులు లేని ఈ హడావిడి ఇప్పుడే ఎందుకు మొదలైందని కూడా మట్కా ప్లేయర్ సర్కిల్లో చర్చ నడుస్తోంది

మట్కా వీరుల మాయజాలం

బూడిదగడ్డలో నివాసం ఉంటున్న ఈ మట్కా వీరుడు తన పలుకుబడితో మాయజాలానికి తెరలేపినట్లు తెలుస్తోంది. తన పార్టనర్ అయిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగితో తెరవెనుక ఓ భారీ మంత్రాంగమే నడిపిస్తున్నట్లు జోరుగా వినిపిస్తోంది. నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించారని తెలుసుకున్న ఈ బ్రాకెట్ పార్టనర్స్ ఒక రెండురోజులు కనిపించకుండా ఉండటమే మేలనుకున్నట్లు ఉన్నారు. అందుకే బ్రాకెట్ ఆటను రెండురోజులు నిలిపి వేసి మళ్ళీ ప్రారంభించారు. అయితే ఈ సారి నేరుగా నగదు రూపంలో కాకుండా డిటిటల్ పద్దతిలో నగదు చెల్లింపులు చేసేలా బుకీలు తమ ఏజెంట్లకు సూచనలు చేశారు. ఇంకేముంది ఏజెంట్లు ఆటకు బానిసైన ఆటగాళ్ళ నుంచి డిజిటల్ పద్దతిలో నగదును తీసుకుంటున్నారు. ఒకరిద్దరు ఏజెంట్ లు మాత్రం నేరుగా రహస్య ప్రాంతానికి వచ్చి నగదు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

తెరవెనుక చక్రం తిప్పుతున్న రిటైర్డ్ ఉద్యోగి

బ్రాకెట్ ఆట నిర్వాహకులు తమకు ఉన్న పరిచయాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు కార్యాచరణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకు బూడిదగడ్డ బుకీ, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఇకపై వారు నియమించుకున్న ఏజెంట్లు నేరుగా నగదు తీసుకోకుండా ఇకపై డిజిటల్ పద్దతిలోనే నగదు చెల్లింపులు చేసుకునేలా ప్లాన్ చేసినట్లు, అప్పుడైతే ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఇక ఆటను సాఫీగా నిర్వహించుకోవచ్చని సమాచారం. ఇందుకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైనవారికి ప్రతీ నెలా ఇస్తున్న మాముళ్ళను ఈ సారి కొంచెం పెంచి ఇస్తామని బేరసారాలు దిగినట్లు చర్చలు జరుగుతున్నట్లు పట్టణంలో వినిపిస్తున్నారు. నెలనెలా కమిషన్ల రూపంలో వస్తున్న లక్షల రూపాయల సంపాదనను ఎలా వదులుకుంటామని బుకీ, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నామని తన ఏజెంట్ల వద్ద ప్రగల్భాలు పలుకుతున్నట్లు చెబుతున్నారు. మట్కా దందాలో బుకీలను, ఏజెంట్లను వదిలి నెంబర్లపై తమ బ్రతుకులో ఎప్పుడైన ఒకసారి అదృష్టం కలిసి రాకపోతుందా...? అని ఆట ఆడుతున్నవారిని అరెస్టు చేసినట్లు సమాచారం.

కానీ వీరే బుకీలు, ఏజెంట్లు అని నమ్మించే విధంగా వారిపై కేసులు నమోదు చేసి మమ.. అనిపించి చేతులు దులుపుకునేలా ఉన్నారని తెలుస్తోంది. బూడిదగడ్డ బుకీ, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కదలికలపై , కొత్తగా ఈ దండలోకి ప్రవేశించిన కార్పొరేటర్ బంధువు పై నిఘా విభాగం అధికారులు, సిబ్బంది ఓ కన్ను వేసి వారి ఆటకట్టించకపోతే జిల్లాలో మట్కా ఆటకు అడ్డు అదుపు లేకుండా పోవడమే కాకుండా అనేక పేద, మధ్యతరగతి ప్రజలు, యువకుల జీవితాలు నాశనం కావడమని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారుఈ మట్కా వ్యవహారంపై త్రీ టౌన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి నీ వివరణ కోరగా మట్కా నిర్వహిస్తున్న వారి వివరాలు సేకరించామని ఇందులో భాగంగా ఓ బుకీ ని, ముగ్గురు బ్రాకెట్ ఆడుతున్న వారిని పట్టుకొని అరెస్ట్ చేశామని తెలిపారు. అక్రమ, అసాంఘిక కార్యకలాపాలను పాల్పడేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని తెలిపారు.

Next Story