టీమ్‌ఇండియా అసిస్టెంట్‌ కోచ్‌ రాజీనామా

by Muthe.Rajitha |

భారత క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ర్యాన్ టెన్ డస్కటే (Ryan ten Doeschate) ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు.

టీమ్‌ఇండియా అసిస్టెంట్‌ కోచ్‌ రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్ : భారత క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ర్యాన్ టెన్ డస్కటే (Ryan ten Doeschate) ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన వైట్-బాల్(టి20, వన్డే) సిరీస్ అనంతరం ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రముఖ క్రీడా సమాచార సంస్థ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో ధ్రువీకరించింది. లండన్‌లో ఉన్న తన భార్య, ముగ్గురు చిన్న పిల్లలతో కలిసి ఎక్కువ సమయం గడపాలని ఆయన భావించడం, టీమ్ ఇండియా నిరంతర పర్యటనల వల్ల కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దీనికి తోడు జట్టులో ప్రత్యేకంగా 'ఫీల్డింగ్ కోచ్' బాధ్యతలను స్వీకరించాలని ఆయన ఆశించినప్పటికీ, రోల్ క్లారిటీ లభించకపోవడం కూడా మరో కారణమని సమాచారం.

2024లో గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుతో కలిసి పనిచేసిన అనుభవంతో గంభీర్ సిఫార్సు మేరకే టెన్ డస్కటే అసిస్టెంట్ కోచ్‌గా నియమితులయ్యారు. బిసిసిఐ (BCCI), గంభీర్ ఆయనను జట్టులోనే కొనసాగించేందుకు ప్రయత్నించినప్పటికీ, తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి విభేదాలు లేకుండా ఇరువర్గాలు స్నేహపూర్వకంగానే ఈ ప్రక్రియను పూర్తి చేయగా, ఐపీఎల్ 2027 సీజన్ నుంచి ఆయన తిరిగి కేకేఆర్ (KKR) కోచింగ్ బాధ్యతల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

Next Story