దేశ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి!

by Kema Shiva Kumar |

దేశ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి!
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త నెలలోకి అడుగుపెడుతున్న వేళ సామాన్యులకు సంబంధించిన పలు కీలక నిబంధనల్లో మార్పులు చోటుచేసుకోనుబోతున్నాయి. ఆర్థిక లావాదేవీలు, రైల్వే ప్రయాణాలు, రేషన్, గ్యాస్ సబ్సిడీలకు సంబంధించి ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. అయితే, వాటిలో పలు ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ఈనెల 31 తుది గడువుగా ఉంది.

ఐటీఆర్ ఫైలింగ్ ఆలస్యమైతే బాదుడే..

కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) సమర్పించడానికి జులై 31తో గడువు ముగియనుంది. పన్ను చెల్లింపుదారులు ఈ తేదీలోపు తమ ఐటీఆర్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ జులై 31 దాటితే, ఆగస్టు 1 నుంచి లేట్ ఫీజు తప్పక చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్నవారికి రూ. 1,000, రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి గరిష్టంగా రూ.5,000 వరకు లేట్ ఫీజు కౌంట్ అవుతుంది.

రైల్వే ‘తత్కాల్ టికెట్’ టోకెన్ల వేళల్లో మార్పులు

అదేవిధంగా రైల్వే స్టేషన్ కౌంటర్లలో తత్కాల్ టికెట్ల కోసం వేచి చూసే ప్రయాణికులకు భారతీయ రైల్వే కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఆగస్టు 1 నుంచి స్టేషన్లలో తత్కాల్ టికెట్ల పంపిణీ కోసం ఇచ్చే టోకెన్ల వేళల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. ఏసీ తరగతి తత్కాల్ టికెట్ల కోసం ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు టోకెన్లను పంపిణీ చేస్తారు. ఇక నాన్-ఏసీ తత్కాల్ టికెట్ల కోసం ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల వరకు టోకెన్ల పంపిణీ ఉంటుంది. కౌంటర్ల వద్ద రద్దీని నియంత్రించేందుకు, పారదర్శకతను పెంచేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది.

తెలంగాణలో రేషన్ ఈ-కేవైసీ రేపే లాస్ట్..

రాష్ట్రంలోని రేషన్ కార్డ్ లబ్ధిదారులు తమ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయడానికి జులై 31 ఆఖరి తేదీగా ఉంది. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు స్థానిక రేషన్ షాపునకు వెళ్లి ఈ-పోస్ యంత్రాల ద్వారా తమ వేలిముద్రలు (Biometric) నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా e-KYC పూర్తి చేయని వారి పేర్లను రేషన్ కార్డ్ నుంచి తొలగించే లేదా సరుకులు నిలిపివేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

PMUY ఈ-కేవైసీ మస్ట్..

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందిన లబ్ధిదారులు తప్పనిసరిగా e-KYC పూర్తి చేయాలని గ్యాస్ ఏజెన్సీలు స్పష్టం చేశాయి. అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి గ్యాస్ సబ్సిడీ సొమ్ము సజావుగా జమ కావడానికి, అక్రమ కనెక్షన్లను అరికట్టడానికి ఈ ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపడుతున్నారు. లబ్ధిదారులు తమ ఆధార్ కార్డ్, గ్యాస్ పాస్ బుక్‌తో సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story