- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షార్ట్ వీడియోలతో ఏకాగ్రతపై దెబ్బ.. ‘పేరెంటల్ కంట్రోల్స్’తో బ్రేక్!
షార్ట్ ఫామ్ వీడియోలు అల్గారిథమ్ ఆధారంగా పని చేస్తాయి. ఇవి నిరంతరం కొత్త కంటెంట్‌ను చూపిస్తూ, మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ను వేగంగా ప్రేరేపిస్తాయి.

దిశ, ఫీచర్స్ : ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా వేదికలు కంటెంట్, వీడియోల వీక్షణపై కఠినమైన నిబంధనలు తెస్తున్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు చిన్నారుల భద్రత, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త ‘పేరెంటల్ కంట్రోల్స్’ అందుబాటులోకి తెస్తున్నాయి. పిల్లల డిజిటల్ అలవాట్లను నియంత్రించడానికి తల్లిదండ్రులు వీటిని తప్పక ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఏం జరుగుతుంది?
యూట్యూబ్ షార్ట్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (YouTube Shorts, Instagram Reels) వంటి షార్ట్ ఫామ్ వీడియోలు అల్గారిథమ్ ఆధారంగా పని చేస్తాయి. ఇవి నిరంతరం కొత్త కంటెంట్‌ను చూపిస్తూ, మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ను వేగంగా ప్రేరేపిస్తాయి. ఈ పరిస్థితి పిల్లలు, టీనేజర్లలో దీర్ఘకాలిక ఏకాగ్రతను (Sustained Attention) తీవ్రంగా దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్షణానికో కొత్త వీడియో చూడటం వల్ల ఒకే అంశంపై ఎక్కువసేపు దృష్టి సారించడం వారికి కష్టమవుతుంది. ఇది మానసిక అలసట, ఓపిక తగ్గడం, ఇన్‌స్టంట్ రివార్డ్స్‌కు అలవాటు పడటం వంటి సమస్యలకు దారితీస్తుంది.
పిల్లలపై ప్రభావం?
షార్ట్ వీడియోల వల్ల శారీరక శ్రమ, ముఖాముఖి సంభాషణలు, నిద్ర, చదువుకునే సమయం తగ్గిపోయి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. నిజానికి సమస్య వీడియో ఫార్మాట్‌లో లేదు.. వాటిని పరిమితి లేకుండా గంటల తరబడి చూడటంలోనే ఉంది అంటున్నారు మానసిక నిపుణులు. అందుకే ఆన్‌లైన్ లెర్నింగ్, రిలాక్సేషన్, రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ మధ్య సమతుల్యత(Balance)ను కాపాడటం చాలా ముఖ్యమని చెబుతున్నారు.
పరిమితులు ఎందుకు?
షార్ట్ కంటెంట్ ఎక్కువ చూసే పిల్లల్లో చదువు, ఇతర పనులపై ఫోకస్, ఆసక్తి తగ్గిపోతున్నట్లు పలు నివేదికలు (The Verge వంటివి) వెల్లడించాయి. అంతేకాకుండా స్క్రీన్ టైమ్‌ను కంట్రోల్ చేయడం కూడా తల్లిదండ్రులకు సవాలుగా మారుతున్నది. అందుకే యూట్యూబ్, ఇతర ప్లాట్‌ఫామ్‌లు తల్లిదండ్రుల కోసం ప్రత్యేక కంట్రోల్స్ తెచ్చాయి. వీటి ద్వారా పిల్లల అకౌంట్లలో YouTube Shortsను పూర్తిగా బ్లాక్ చేయడం లేదా రోజువారీ సమయ పరిమితి (Time Limit)ని విధించడం సాధ్యమవుతుంది. పిల్లల ఆన్‌లైన్ ప్రవర్తనను సరైన దారిలో పెట్టడానికి ఈ కొత్త మార్పులు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు భావిస్తున్నారు.






