- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
' పిల్లల రక్షణలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర '
పిల్లల జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవానీ చంద్ర అన్నారు.

దిశ, సంగారెడ్డి అర్బన్ : పిల్లల జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవానీ చంద్ర అన్నారు. జాతీయ న్యాయ సేవా సంస్థ ఎన్ఎఎల్ఎస్ఎ రూపొందించిన చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ టు చిల్డ్రన్స్ స్కీమ్ 2024, తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖతో కుదిరిన అవగాహన ఒప్పందం ఎంఓయు అమలులో భాగంగా, సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నియమితులైన చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు ఒక రోజు సెన్సిటైజేషన్ కార్యక్రమాన్ని శనివారం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో, జిల్లా విద్యాశాఖ సమన్వయంతో కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్‌పర్సన్ జి. భవానీ చంద్ర, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్యఅతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 239 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 239 మంది ఉపాధ్యాయులను చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా నియమించినట్లు ఈ సందర్భంగా తెలిపారు.
వీరికి పిల్లల రక్షణ, హక్కుల పరిరక్షణ, పాఠశాల స్థాయిలో బాలల సమస్యలను గుర్తించడం, చట్టపరమైన రక్షణ కల్పించడం, సంబంధిత శాఖలతో సమన్వయం వంటి అంశాల పై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవానీ చంద్ర మాట్లాడుతూ ప్రతిచిన్నారికి సురక్షితమైన, భయ, హింస రహితమైన విద్యా వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తూ, వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను నిశితంగా గమనించాలని సూచించారు. బాలల పై జరిగే వేధింపులు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మాదకద్రవ్యాల ప్రభావం, పోక్సోచట్టం, సైబర్ నేరాలు వంటి అంశాలపై అప్రమత్తంగా ఉండి, ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పిల్లల రక్షణను అదనపు బాధ్యతగా కాకుండా సమాజానికి చేసే గొప్ప సేవగా భావించాలని ఆమె సూచించారు.
ప్రతి పాఠశాలలో చైల్డ్ ప్రొటెక్షన్ వ్యవస్థను పటిష్టం చేయాలి - కలెక్టర్
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు సమర్థవంతంగా పనిచేస్తే బాలల రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. పిల్లలతో స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పరచి వారి నమ్మకాన్ని పొందాలని, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, సైబర్ భద్రత, ఆన్‌లైన్ మోసాలు, మానసిక ఆరోగ్యం, బాలల హక్కులు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు వంటి అంశాల పై నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ప్రవర్తనా మార్పులను ప్రారంభ దశలోనే గుర్తించి తల్లిదండ్రులు, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ చైతన్య రెడ్డి మాట్లాడుతూ బాలల భద్రతకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఉపాధ్యాయులు అత్యంత బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. పిల్లల పై జరిగే నేరాలు, పోక్సో చట్టం, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి అంశాల పై విద్యార్థులకు నిరంతరం అవగాహన కల్పించాలని, పిల్లలు లేదా తల్లిదండ్రులు భయంతో సమస్యలను బయటపెట్టలేని సందర్భాల్లో ఉపాధ్యాయులే ముందుకు వచ్చి సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.
జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి బి. సౌజన్య మాట్లాడుతూ చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ టు చిల్డ్రన్ స్కీమ్ 2024 లక్ష్యాలను వివరించారు. పాఠశాల స్థాయిలో పిల్లల సమస్యలను గుర్తించి, అవసరమైన సందర్భాల్లో జిల్లా న్యాయ సేవా సంస్థతో సమన్వయం చేసుకుని బాధిత బాలలకు ఉచిత న్యాయ సహాయం, కౌన్సెలింగ్, రక్షణ చర్యలు అందేలా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ గా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శ్రీలేఖ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి డీవీఆర్ తేజో కార్తీక్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. ధనలక్ష్మి పాల్గొని పోక్సో యాక్ట్, బాలల హక్కులు, పాఠశాలల్లో చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజం, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారుల బాధ్యతలు, బాలల పై వేధింపులను గుర్తించడం, బాలలకు అందుబాటులో ఉన్న న్యాయ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల పై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి. సంజీవ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ రోహిణి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి డీడబ్ల్యూఓ లలిత కుమారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సిడబ్ల్యూసి చైర్మన్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రాజారెడ్డి, వివిధ శాఖల అధికారులు, జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి నియమితులైన చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు సీపీఓలు తదితరులు పాల్గొన్నారు.






