- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి గ్రామంలో విస్తృత స్థాయిలో జలసిరి కార్యక్రమాలను చేపట్టాలి: మంత్రి సీతక్క
ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'తెలంగాణ జలసిరి' కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విస్తృత స్థాయిలో అమలు చేయాలని మంత్రి దనసరి అనసూయ(సీతక్క) సూచించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'తెలంగాణ జలసిరి' కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విస్తృత స్థాయిలో అమలు చేయాలని మంత్రి దనసరి అనసూయ(సీతక్క) సూచించారు. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), డీఆర్డీఓలు, జెడ్పీ సీఈఓలు, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో, ఎం.పీ.డీ.ఓలతో మంత్రి సీతక్క శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెర్ప్ సీ.ఈ.ఓ దివ్యదేవరాజన్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో వీబీజీ రామ్-జీ (VBG-RAM-G) పథకం కింద గ్రామాల్లో ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, పంట కుంటలు, బోరు బావుల రీఛార్జ్ నిర్మాణాలు విరివిగా చేపట్టి కూలీలకు ఉపాధి కల్పించాలని అన్నారు.
గ్రామ సభలను నిర్వహిస్తూ ఈ పనుల ఆవశ్యకత గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, వచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి అన్ని గ్రామాల్లో ఈ పనులు పూర్తయ్యేలా ప్రణాళికాబద్దంగా కృషి చేయాలన్నారు. రానున్న రోజుల్లో నీటి కొరతను ఎదుర్కొనేందుకు ప్రతి వర్షపు చుక్కను భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వం వీబీజీ రామ్-జీ పథకం కింద ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊటకుంటలు, బోరు బావుల రీఛార్జ్ వంటి నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో విరివిగా జలసిరి కార్యక్రమం అమలయ్యేలా చూడాలన్నారు. ఈ పనుల పరిశీలన కోసం మండల స్థాయిలో గ్రామీణ నీటి సరఫరా ఏ.ఈ, పంచాయతీరాజ్ ఏ.ఈ, ఎం.పీ.డీ.ఓ, ఎం.పీ.ఓ, ఏ.పీ.ఓలతో కమిటీని ఏర్పాటు చేసి, వారి అధ్వర్యంలో పనులను పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు.
ప్రతీచోట పండగ వాతావరణంలో జలసిరి కార్యక్రమాలు అమలు జరగాలని, ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. కూలీలకు చేతినిండా పని కల్పిస్తూ, పనిదినాల లక్ష్యాన్ని సాధించడంతో పాటు నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపాలని హితవు పలికారు. వీబీజీ రామ్-జీ పథకం కింద 318 రకాల పనులను చేపట్టవచ్చని, అయితే ప్రస్తుత తరుణంలో భూగర్భ జలాల పెంపునకు దోహదపడే జలసిరి కార్యక్రమాల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా వన మహోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటించాలని దిశా నిర్దేశం చేశారు. గ్రామ సభలలో చర్చించుకుని చేపట్టే ప్రతి పని ప్రజలకు ఉపయోగకరంగా నిలవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, డీపీఓ శ్రీనివాస్ రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






