యూపీఏ చేయనిది.. ఎన్డీఏ చేసింది : బీజేపీ రామచందర్ రావు

by Naga Rani Yarlagadda |

పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2024లో ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం - 2024’ ను తీసుకువచ్చిందని, యూపీఏ ప్రభుత్వం చేయలేని పనిని ఎన్డీఏ ప్రభుత్వం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు తెలిపారు.

యూపీఏ చేయనిది.. ఎన్డీఏ చేసింది : బీజేపీ రామచందర్ రావు
X
  • ఎన్టీఏలో సంస్కరణలకు శ్రీకారం
  • 47మంది అధికారుల బదిలీలు

దిశ, తెలంగాణ బ్యూరో: పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2024లో ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం - 2024’ ను తీసుకువచ్చిందని, యూపీఏ ప్రభుత్వం చేయలేని పనిని ఎన్డీఏ ప్రభుత్వం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా అనేక పరీక్షా లీకేజీలు జరిగినప్పటికీ, ఇలాంటి కఠినమైన చట్టాన్ని తీసుకురాలేకపోయారని, కానీ మోదీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చట్టపరమైన రక్షణ కల్పించిందని తెలిపారు. పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా, నిష్పాక్షికంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిపుణులతో కూడిన రాధాకృష్ణ కమిటీ సిఫార్సుల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో పలు సంస్కరణలు చేపట్టిందన్నారు. అధికారుల నిర్లక్ష్యం లేదా ఇతర కారణాల వల్ల లోపాలు జరిగిన నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటూ, దాదాపు 47 మంది అధికారులను బదిలీ చేసిందని తెలిపారు. తప్పు చేసిన వారిని ఉపేక్షించబోమనే సంకల్పాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చాటిందన్నారు.

ప్రస్తుతం 2024 చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ పార్లమెంట్‌లో సవరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ సవరణలతో పరీక్షా పత్రాల లీకేజీ, అవకతవకలకు పాల్పడిన వారిపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని బలోపేతం చేస్తున్నారని అన్నారు. ఈ చట్టం పరిధిలో యూపీఎస్సీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే పరీక్షలతో పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని ప్రజా పరీక్షలు ఉంటాయని వివరించారు. పరీక్షా పత్రాల లీకేజీ లేదా ఇతర అక్రమాలకు పాల్పడిన వారికి కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించేలా చట్టాన్ని మరింత కఠినతరం చేస్తున్నారని, అలాగే ఇప్పటివరకు ఉన్న రూ.1 కోటి జరిమానాను రూ.15 కోట్ల వరకు పెంచే ప్రతిపాదన తీసుకొచ్చారని తెలిపారు. పరీక్షా లీకేజీ కేసుల విచారణను వేగవంతం చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి, నాలుగు నెలల్లోపు దర్యాప్తు పూర్తిచేసి చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని, ఇటీవల జరిగిన పరిణామాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా ఆందోళన చేస్తున్న విద్యార్థి ప్రతినిధులతో చర్చలు జరిపి, వారి అభిప్రాయాలను విని, సానుకూల వాతావరణాన్ని నెలకొల్పేందుకు చర్యలు తీసుకుందని తెలిపారు.

Next Story