Telangana News: 19 జిల్లాల టీచర్లకు జీతాల్లేవ్.. ధనిక రాష్ట్రంలో ఇబ్బందులు

by Disha Web Desk 2 |
Telangana News: 19 జిల్లాల టీచర్లకు జీతాల్లేవ్.. ధనిక రాష్ట్రంలో ఇబ్బందులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి దాపురించింది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో ఇప్పటివరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేతనాలు అందలేదు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలోనూ ఇదే పరిస్థితి. కొట్లాడి సాధించకున్న తెలంగాణలో ఒకటో తేదీనే వేతనాలు అందుతాయని ఉద్యోగులందరూ భావించారు. కానీ అది సాధ్యపడటంలేదు. తెలంగాణలో దాదాపు 90 శాతం మంది టీచర్లకు లోన్లు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రతినెల ఈఎంఐ రూపంలో చెల్లిస్తున్నారు. ఉపాధ్యాయలు చాలామంది మొదటి వారంలోపే ఈఎంఐ చెల్లింపులు చేసుకునేందుకు ఆటో డెబిట్​ఆప్షన్‌ను పెట్టుకున్నారు. వేతనాలు ఒకట్రెండు రోజులు అటు ఇటు అయినా మొదటివారంలో చెల్లించవచ్చని వారు భావించారు. ఇదే వారి పాలిట శాపంగా మారింది. అటు వేతనాలు అందకపోవడం ఒక సమస్య అయితే ఈఎంఐ గడువు దాటిపోవడం తలనొప్పిగా మారింది. సమయానికి చెల్లింపులు జరగకపోవడం వల్ల చెక్కులు బౌన్స్​అవుతున్నాయి. దీంతో ఉద్యోగుల సిబిల్​స్కోర్‌కు దెబ్బ పడుతోంది. భవిష్యత్‌లో లోన్లు పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. కొందరు టీచర్లు ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు అప్పులు చేసి బ్యాంకులకు ఈఎంఐలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడూ ఇలాంటి ఇబ్బందులు పడలేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడిగా ఉన్న సమయంలో ఒకట్రెండు రోజులు వేతనాల చెల్లింపులకు ఆలస్యం జరిగేదని, కానీ స్వరాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి దాపురించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్పే ధనిక రాష్ట్రం ఇదేనా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇప్పటివరకు వేతనాలు అందింది కేవలం 14 జిల్లాల ఉపాధ్యాయులకు మాత్రమే. అది కూడా ఒక్కో రోజు ఒక్కో జిల్లాకు జమ అయ్యాయి. పెన్షనర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారికి ప్రతినెల 1వ తేదీన వేతనాలు చెల్లిస్తున్నారు. కానీ మిగిలిన వారికి చెల్లించకపోవడంపై ఆగ్రహ జ్వాలలు రేకెత్తుతున్నాయి. రంజాన్ మాసం ఇప్పటికే ప్రారంభమైంది. ముస్లిం ఉపాధ్యాయులు రోజా, శైరి ఉంటున్నారు. వారికి డ్రైఫ్రూట్, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో ఈ పరిస్థితి దాపురించడానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

317 జీవోతో మరో సమస్య

రాష్ట్రంలో ఉపాధ్యాయులు 317 జీవోతో పాటు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వేతనాల రూపంలో మరో సమస్య వారికి ఎదురైంది. ప్రభుత్వంపై నేరుగా పోరాడితే కక్షసాధింపు చర్యలకు దిగుతోందని టీచర్లు భయపడుతున్నారు. ఈ విషయంలో ఎవరూ ముందడుగు వేయడంలేదు. గవర్నర్​ఈ విషయంలో జోక్యం చేసుకుంటే తమ కష్టాలు దూరమవుతాయని పలు ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి. హైకోర్టు సైతం ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని టీచర్లకు న్యాయం చేయాలని కోరుతున్నాయి. శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవుదినం కావడంతో సోమవారమైనా వేతనాలు అందుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

వేతనాలు జమకాని జిల్లాలివే..

= ఆదిలాబాద్

= కొమురం భీం

= నిర్మల్​

= జగిత్యాల

= కరీంనగర్​

‌‌= పెద్దపల్లి

= జనగామ

= ములుగు

= మహబూబాబాద్​

= కామారెడ్డి

= భద్రాద్రి కొత్తగూడెం

= సంగారెడ్డి

= సిద్దిపేట

= సూర్యాపేట

= యాదాద్రి భువనగిరి

= మెదక్​

= నాగర్​కర్నూల్​

= వనపర్తి

= గద్వాల


Next Story

Most Viewed