- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిటీ వదలని ఇంజినీర్లు.. జిల్లాల్లోనే మగ్గుతున్న క్షేత్రస్థాయి ఉద్యోగులు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల కోసం ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో 38లోని ఒకే ఒక్క నిబంధన ఇప్పుడు తీవ్ర అక్రమాలకు, పక్షపాతానికి దారితీస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల కోసం ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో 38లోని ఒకే ఒక్క నిబంధన ఇప్పుడు తీవ్ర అక్రమాలకు, పక్షపాతానికి దారితీస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెక్షన్ 6(బి) నిబంధన ప్రకారం స్టేషన్ అంటే కేవలం పనిచేసే గ్రామం, పట్టణం లేదా నగరం మాత్రమే.. కార్యాలయం లేదా సంస్థ కాదు అని స్పష్టం చేశారు. అయితే ఈ నిబంధనను కొందరు ఉన్నతాధికారులు, పైరవీకారులు తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఒకే జీవోకు జిల్లాలో ఒకలా, నగరంలో మరోలా వ్యక్తులను బట్టి ఒక రూల్ అన్నట్టుగా అమలు చేస్తూ పెద్ద ఎత్తున మోసాలకు తెరలేపినట్లు తెలుస్తోంది.
నగరం వదలని నగర బాబులు
ఈ నిబంధన ప్రకారం హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కీలక పోస్టింగుల్లో ఉన్న కొందరు ఇంజినీర్లు ఏళ్ల తరబడి నగరాన్ని వదలకుండా తిష్ట వేస్తున్నారు. జీవో 38 ప్రకారం ఒకే నగర పరిధిలో ఆఫీసులు మారినా స్టేషన్ మారనట్టే లెక్క. ఇక్కడే పెద్ద మానిపులేషన్ జరిగింది. ఉదాహరణకు, ఒక ఇంజినీర్ నగరంలోని ఎర్రమంజిల్ ఆఫీసు నుంచి ఖైరతాబాద్ ఆఫీసుకు షిఫ్ట్ అయినా కూడా.. రూల్ ప్రకారం ఒకే నగరంలో (హైదరాబాద్) కొనసాగుతున్నారు. కాబట్టి వారి పాత సర్వీసును, కొత్త సర్వీసును కలిపే లాంగ్‌స్టాండింగ్ కింద లెక్కించాలి. కానీ ఈ బదిలీల ప్రక్రియలో కొందరు సదరు పాత సర్వీసును రికార్డుల నుంచి మాయం చేసి సర్వీస్ కాలాన్ని మానిపులేట్ చేసినట్లు తెలుస్తోంది. ఒకే నగరంలో అంతర్గతంగా సీట్లు మార్చుకుంటూ, లూప్‌హోల్స్ వాడుకుంటూ వారు నగరాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం లేకుండా సేఫ్ జోన్‌లో ఉండిపోతున్నారు. ఫలితంగా సిటీలో ఉన్న వాళ్లు అక్కడే ఉండిపోతున్నారు. ఏళ్ల తరబడి జిల్లాల్లో మగ్గుతున్న వారికి నగరానికి వచ్చే అవకాశం దక్కకుండా పోతోంది.
జిల్లాల్లోని ఇంజినీర్లకు శాపంగా మారిన రూల్!
ఇదే నిబంధనను జిల్లాల్లో పనిచేసే ఇంజినీర్లకు వర్తింపజేసే సరికి అది వారికి తీవ్ర అన్యాయం చేసేదిగా మారింది. నగరంలో ఆఫీసులు మారినా ఒకే స్టేషన్ కింద మినహాయింపులు పొందుతుంటే, జిల్లాల్లో మాత్రం కొద్దిపాటి దూరంలో ఊరు మారినా సర్వీస్ లెక్కలు మారిపోతున్నాయి. ఉదాహరణకు ఓ ఇంజినీర్ ఓ జిల్లాలోనే ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి/పట్టణానికి మారితే ప్లేస్ మారింది కాబట్టి స్టేషన్ మారినట్టుగా అధికారులు పరిగణిస్తున్నారు. జిల్లాల్లోని ఇంజినీర్లు అతి తక్కువ సంవత్సరాలు లాంగ్‌స్టాండింగ్ ఉన్నా బదిలీల పరిధిలోకి రాక, తమకు (హైదరాబాద్ వంటి నగరాలకు) బదిలీ కోరుకునే అవకాశం కోల్పోతున్నారు. ఒకే రూల్‌ను హైదరాబాద్‌లో వారికి మేలు చేయడం కోసం ఒకలా, జిల్లా వారికి అన్యాయం చేయడానికి ఇంకోలా వర్తింప చేయడం సరికాదని ఇంజినీర్లు వాపోతున్నారు.
20 ఏళ్ల సర్వీస్ 9 ఏళ్లుగా గుర్తింపు!
బదిలీల ప్రక్రియలో కొందరు ఉద్యోగుల ఇన్‌కంబెన్సీ (సర్వీస్ కాలం) వివరాలను పూర్తిగా తారుమారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. రెటెన్షన్ కోసం జిమ్మిక్కులు చేసినట్లు బాధిత ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. ఒకే ఆఫీసులో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కొందరు బడా బాబుల సర్వీసును కేవలం 9 సంవత్సరాలు మాత్రమే ఉన్నట్లు రికార్డుల్లో చూపించి, వారు అక్కడే కొనసాగేలా (రిటెన్షన్) నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి చేకూర్చడం గమనార్హం. డీఈఈ, ఈఈగా 19 ఏళ్లుగా నగరంలోని ఒకే కార్యాలయంలో వేరువేరు విభాగాల్లో పనిచేస్తున్న ఓ అధికారి ఇప్పుడు తన సీనియారిటీని చూపించకుండా తిరిగి అక్కడే ఉండేందుకు జిమ్మిక్కులు చేశారని... ఒకే శాఖలో ఒక్కొక్కరికి ఒక్కో రూల్ వర్తింపజేస్తూ, నచ్చిన వారికి ఒకలా, పైరవీలు లేని వారికి మరోలా ఈ స్టేషన్ నిర్వచనాన్ని అధికారులు తమకు నచ్చినట్లుగా వాడుకుంటున్నారని బాధిత ఇంజినీర్లు చెబుతున్నారు.
చేతులెత్తేసిన అడ్మినిస్ట్రేషన్!
హెచ్‌ఓడీలు సమర్పించిన ఉద్యోగుల సమాచారాన్ని, ఖాళీల వివరాలను క్రాస్ చెక్ చేయడానికి ఉన్నతాధికారుల వద్ద సరైన నిఘా గానీ, కనీస అడ్మినిస్ట్రేటివ్ వివరాలు గానీ లేకపోవడం ఈ అక్రమాలకు మరింత అవకాశం కల్పించింది. బదిలీల జాబితాలపై సరైన స్క్రూటినీ లేకపోవడంతో శాఖాధిపతులు పంపిన తప్పుడు రికార్డులే ఫైనల్ అవుతున్నాయి. ఈ స్టేషన్ నిబంధనలోని లూప్‌హోల్స్‌ను ఆసరాగా చేసుకుని నగర బాబులు ఆడుతున్న అంతర్గత బదిలీల ఆటకు, సర్వీస్ కాలం మానిపులేషన్లకు అడ్డుకట్ట వేసి, రికార్డుల తారుమారుపై సమగ్ర విచారణ జరపాలని, లేనిపక్షంలో జిల్లాల్లో రాత్రింబవళ్లు కష్టపడే ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.






