- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపటి నుంచి అమల్లోకి భూముల కొత్త ధరలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర, ఇండ్లు, అపార్టుమెంట్ల ధరలు పెరగనున్నాయి. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ మార్కెట్ వ్యాల్యూస్ అమలు చేయాలని నిర్ణయించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర, ఇండ్లు, అపార్టుమెంట్ల ధరలు పెరగనున్నాయి. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ మార్కెట్ వ్యాల్యూస్ అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ధరల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తయ్యింది. ఐజీఆర్ఎస్ వెబ్‌సైట్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా పెరిగిన ధరల డేటాను అప్‌లోడ్ చేశారు. ఐతే మంచి మహూర్తం కోసం వేచి చూస్తున్నారని ప్రచారం. ఎప్పుడైతే మార్కెట్ వ్యాల్యూస్ పెరుగుతున్నాయని ప్రకటించారో, అప్పటి నుంచి భూ క్రయవిక్రయాల జోరు పెరిగింది. ఒక్క నెలలోనే రూ.1,700 కోట్ల మేరకు ఆదాయం సమకూరింది. సాధారణంగా నెలలో రూ.1,100 కోట్లు దాటిందంటేనే రికార్డు బ్రేక్ అంటారు.
అలాంటిది ఏకంగా రూ.600 కోట్లు అదనంగా లభించింది. ఇంకా స్లాట్ బుకింగ్స్ దొరక్క వేచి చూస్తున్న వారూ లేకపోలేదు. అందుకే మరో రూ.300 కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం వ్యూహాన్ని ఖరారు చేసిందని సమాచారం. అంటే రూ.2వేల కోట్లకు చేరేలా ప్లాన్ వేసినట్లు తెలిసింది. అందుకే ఈ నెల 4న పెంచాల్సిన మార్కెట్ విలువలను 5వ తేదీకి వాయిదా వేశారు. పైగా ఆరో తేదీన రంగారెడ్డి జిల్లా కోహెడలో పండ్ల మార్కెట్ ఓపెనింగ్ ఉంది. అక్కడే రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదే వేదికపై మార్కెట్ ధరలను కూడా ప్రకటించడం బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు అధికారుల నుంచి అందిన సమాచారం. దీంతో మరో రోజు మాత్రమే పాత భూముల ధరలు అమలు కానున్నాయి.
అంతా సిద్ధం.. ఆదేశాలే తరువాయి
మార్కెట్ వ్యాల్యూస్ రివిజన్ పూర్తయి చాలా రోజులైంది. ఈ మేరకు ఐజీఆర్ఎస్ వెబ్‌సైట్‌లోనూ అప్‌లోడ్ చేసి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉన్నతాధికారులు తొలుత ఈ నెల 4వ తేదీ నుంచి అమలు చేయాలని చెప్పారు. ఐతే వ్యూహాన్ని మరో రోజుకి వాయిదా వేశారు. దాని వెనుక రెండు అంశాలను చూపిస్తున్నట్లు సమాచారం. ఒకటేమో రూ.300 కోట్ల అదనపు ఆదాయం, రెండోది కోహెడలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన.. వీటిని ఆధారంగా చేసుకొని కసరత్తు చేస్తున్నారు. అంతా సిద్ధమైందనేది వాస్తవం. ఉన్నతాధికారులు ఒక్క క్లిక్ చేస్తే పాత రేట్లు మాయమై, కొత్త రేట్లు వెబ్‌సైట్‌లో దర్శనమిస్తాయంటున్నారు. అధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు సబ్ రిజిస్ట్రార్లు తెలిపారు.
ఏడాదికోసారి లెక్క..
నిజానికి భూముల మార్కెట్ విలువలు ఏడాదికోసారి రివిజన్ చేయాలని మార్కెట్ వ్యాల్యూస్ గైడ్‌లైన్స్‌లో స్పష్టంగా ఉంది. ఐతే 2013 ఏప్రిల్ ఒకటో తేదీన పెంచిన ధరలను తిరిగి 2021 దాకా అమలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్ల వరకు పాత ధరలనే అమలు చేశారు. దీనికి కారణం లేకపోలేదు. పలు ఇరిగేషన్, ఇతర ప్రాజెక్టులు, ప్రజాప్రయోజనాల కోసం భూ సేకరణ పెద్ద ఎత్తున చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ధరలను పెంచితే దానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్వాసితులకు నష్టపరిహారం అందించాల్సి వస్తుంది. దాని వల్ల ప్రాజెక్టు వ్యయం పెరుగుతుంది. అందుకే ఏడేండ్ల వరకు భూ సేకరణ ప్రక్రియను చేపట్టారు. అంతా అయిపోయిన తర్వాత ధరల పెంపును ముందేసుకున్నారు. తొలుత కేసీఆర్ ప్రభుత్వం 2021లో ఒకసారి, 8 నెలల తర్వాత 2022లో మరోసారి పెంచింది. మళ్లీ నాలుగేండ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్ విలువలను రివిజన్ చేసింది. ఐతే దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.






