TATA Motors: 2021-22 లో 160 కొత్త సర్వీస్ సెంటర్లను ప్రారంభించిన టాటా మోటార్స్!

by Disha Web Desk 17 |
TATA Motors: 2021-22 లో 160 కొత్త సర్వీస్ సెంటర్లను ప్రారంభించిన టాటా మోటార్స్!
X

ముంబై: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఈ ఏడాది మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల కోసం కొత్తగా 160 సర్వీస్ సెంటర్లను ప్రారంభించినట్టు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో 2022, ఏప్రిల్ 1 నాటికి కంపెనీ మొత్తం 705 వర్క్‌షాప్‌లను కలిగి ఉందని పేర్కొంది. దేశవ్యాప్తంగా 485 నగరాల్లో కంపెనీ సర్వీసుల విస్తరణను పెంచడానికి ఈ విస్తరణ ప్రక్రియ దోహదపడిందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కార్ల సర్వీసుల సంఖ్య కూడా 30 శాతం పెరిగినట్లు కంపెనీ వివరించింది. ఈ క్రమంలోనే టాటా మోటార్స్ కొత్తగా ఈజ్‌సర్వ్ కార్యక్రమాన్ని ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులకు ఇంటివద్దనే ద్విచక్ర వాహనాల సర్వీసులను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది.

ఈ సందర్భంగా మాట్లాడిన టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం హెడ్ డింపుల్ మెహతా.. గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా కంపెనీ వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు సర్వీస్ సెంటర్ల సామర్థ్యాన్ని విస్తరించాం. ప్రస్తుతం కంపెనీ సర్వీసులను అందించడంలో మరింత సౌకర్యవంతంగా వినియోగదారులకు సేవలందించేందుకు సర్వీస్ టచ్‌పాయింట్లను మెరుగుపరచనున్నామని చెప్పారు. అంతేకాకుండా టాటా మోటార్స్ సర్వీస్ సెంటర్లలో రిపేర్ ఆర్డర్లకు సంబంధించిన ప్రక్రియను డిజిటలైజ్ చేసినట్లు పేర్కొంది. దీంతో వినియోగదారులు వాహనాలకు సంబంధించిన సందేహాలను, ఇతర ధరల సంబంధిత విషయాలను తెలుసుకునేందుకు వీలవుతుందని కంపెనీ వెల్లడించింది.


Next Story

Most Viewed