ట్యాంకర్లే దిక్కు..! దాహంతో విలవిల్లాడుతున్న గాగిల్లాపురం గ్రామస్తులు

by Jakkula.Mamatha |

మండలంలోని గాగిల్లాపురం గ్రామ పంచాయతీలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది.

ట్యాంకర్లే దిక్కు..! దాహంతో విలవిల్లాడుతున్న గాగిల్లాపురం గ్రామస్తులు
X

దిశ,చందంపేట: మండలంలోని గాగిల్లాపురం గ్రామ పంచాయతీలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. గత రెండు నెలలుగా గ్రామానికి మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం, గ్రామ పంచాయతీ ద్వారా అందాల్సిన తాగునీరు అందకపోవడంతో గ్రామస్థులు సొంత ఖర్చులతో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకుంటూ దాహార్తిని తీర్చుకుంటున్నారు. గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు వారానికి ఒకసారి ట్యాంకర్లను తెప్పించుకొని ఇళ్ల వద్ద నిల్వ చేసుకుంటున్నారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. తాగునీరు, వంట అవసరాలు, ఇతర నిత్యావసరాల కోసం నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది.

తాగునీటి సమస్య పై పలుమార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చి హామీలు ఇచ్చిన నాయకులు ప్రస్తుతం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. “రెండు నెలలుగా మంచినీరు అందడం లేదు. ప్రతి వారం సొంత డబ్బులతో ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలి” అని గ్రామస్థులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గాగిల్లాపురం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story