మార్క్సిజం అజేయం : తమ్మినేని వీరభద్రం

by Muthe.Rajitha |

మార్క్సిస్టు సిద్దాంతం అజేయమైనదనీ, అది కింద పడ్డప్పడల్లా మరింత రెట్టింపు ఉత్సాహంతోపైకి లేచిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తెలిపారు.

మార్క్సిజం అజేయం : తమ్మినేని వీరభద్రం
X

దిశ, తెలంగాణ బ్యూరో : మార్క్సిస్టు సిద్దాంతం అజేయమైనదనీ, అది కింద పడ్డప్పడల్లా మరింత రెట్టింపు ఉత్సాహంతోపైకి లేచిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తెలిపారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మూడురోజులపాటు నిర్వహించే రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభ సూచకంగా పార్టీ సీనియర్ నాయకులు సారంపెల్లి మల్లారెడ్డి జెండాను ఆవిష్కరించారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ పెట్టుబడిదారీ సమాజంలో ఉత్పత్తి పెరుగుదలకు ఉత్పత్తి సాధనాలపై ప్రయివేటు వ్యక్తుల యాజమాన్యం ఆటంకమైనపుడు సామాజిక విప్లవం ద్వారా సోషలిస్టు వ్యవస్థకు పరిణామం చెందటం అనివార్యమని మార్క్స్ నిరూపించాడని చెప్పారు. ఈ శాస్త్రీయ ప్రతిపాదనలన్నీ మార్క్స్ ఊహించి చేసినవేమీ కావన్నారు. భూమి పుట్టుక నుండి ప్రకృతి, అందులో భాగమైన మానవ సమాజమూ నిరంతరాయంగా మారుతూ వస్తోందని చెప్పారు.

మార్క్స్ గొప్పదనమంతా గతాన్ని విశ్లేషించి, వర్తమానాన్ని అర్థంచేసుకుని, భవిష్యత్తును అంచనా వేయగలిగాడని వివరించారు. 1948లో మార్క్, ఎంగెల్స్‌లు ఉమ్మడిగా రచించిన ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ కార్మిక వర్గానికి సిద్ధాంత ఆయుధంగా అందించబడిందన్నారు. ఈ నేపథ్యంలోనే మన దేశంలో సోషలిజం ఎలా ఉండాలి అనేది సీపీఎం కొజికోడ్ మహాసభ(2012)లో స్థూలంగా నిర్దారించుకున్నదని గుర్తు చేశారు. దానిలో ప్రజాస్వామ్యం, బహుళ పార్టీల రాజకీయ వ్యవస్థ తదితర అంశాల గురించి చెప్పిందని తెలిపారు. గత అనుభవాలను బట్టి ఉద్యమాలు సరళరేఖలో సాగిపోవనీ, ఈ ఆటుపోట్లు సహజమనీ, ఇంతకంటే పెద్ద ఆటంకాలను, ఊచకోత హత్యాకాండలను కూడా అధిగమించి కమ్యూనిస్టు ఉద్యమం పురోగమించిందనీ మనకు అర్ధమౌతుందన్నారు. అందువల్ల నేటి ఆటంకాలు, ఉద్యమ బలహీనతల నుండి గుణపాఠాలు నేర్చుకోవటం, తిరిగి ఉద్యమం ఉవ్వెత్తున మళ్లీ పుంజుకోవటం అనేది అనివార్యమైన పరిణామని చెప్పారు.

అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధం కేవలం ఆ మూడుదేశాలకేగాక మొత్తం ప్రపంచంపైన ప్రభావం చూపుతుందన్నారు. ఆర్ధిక, రాజకీయ సంక్షోభాలు ఏర్పడతాయన్నారు. అమెరికా తిరుగులేని ప్రపంచాధిపత్యం బద్దలౌతుందన్నారు. అమెరికా ఆర్ధిక, మిలటరీ శక్తులు ఇప్పటికే బాగా బలహీనపడ్డాయని చెప్పారు. చైనా అధ్వర్యంలో అనేక సామ్రాజ్యవాద వ్యతిరేక దక్షిణాది దేశాలు ఈ సమస్యపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాయన్నారు. ఈ క్రమం ఇంకా వేగవంతమై అమెరికా పెత్తనం నశించి బహుళధృవ ప్రపంచం ఏర్పడే సూచనలు గోచరిస్తున్నాయని చెప్పారు. కమ్యూనిస్టు ఉద్యమ పురోభివృద్ధికున్న ఈ ముఖ్యమైన ఆటంకం తొలగితే, మిగతా ఆటంకాలు బలహీనమవటం, ఉద్యమాలు తిరిగి ఉత్సాహంగా సాగటం తప్పక జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ అధ్యక్షత వహించగా జూలకంటి రంగారెడ్డి, ఎండి అబ్బాస్, జి నాగయ్య పాల్గొన్నారు.

Next Story