తమిళ స్టార్ హీరో అజిత్ తల్లి కన్నుమూత

by Malleboina Mahesh |

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తల్లి మోహిని (84) వృద్ధాప్య సమస్యలతో చెన్నైలో కన్నుమూశారు. దుబాయ్ నుంచి అత్యవసరంగా బయలుదేరిన అజిత్.

తమిళ స్టార్ హీరో అజిత్ తల్లి కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి మోహిని (84) ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతుండటంతో, చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. రెండేళ్ల క్రితమే అజిత్ తన తండ్రి సుబ్రమణ్యంను కోల్పోగా.. ఇప్పుడు తల్లి కూడా దూరమవ్వడం ఆయన కుటుంబంలో పెద్ద లోటుగా మారింది. అజిత్‌కు తన తల్లిదండ్రులంటే ఎంతో ప్రాణమని, ఈ నష్టం ఆయనకు వ్యక్తిగతంగా తీరని లోటని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.

ఇటీవలే తన సినిమా కెరీర్, కార్ రేసింగ్‌పై దృష్టి పెట్టిన అజిత్, ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తల్లి మరణ వార్త విన్న వెంటనే ఆయన అత్యవసరంగా తమిళనాడుకు తిరిగి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న అజిత్, తన విజయాల వెనుక కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ఉందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మోహిని మరణ వార్త తెలియగానే సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ రంగ ప్రముఖులు అజిత్ కుటుంబానికి తమ ఘన నివాళులు అర్పిస్తూ సెంటిమెంట్ మెసేజ్‌లు పోస్ట్ చేస్తున్నారు. కాగా, రేపు (ఆదివారం) చెన్నైలో మోహిని అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.

Next Story