తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. AIADMK మూడో విడత హామీల విడుదల

by Malleboina Mahesh |

AIADMK మూడవ విడత హామీలు విడుదల. ప్రతి కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సాయం, నిరుద్యోగ పట్టభద్రులకు రూ. 2,000 భృతి ఇస్తామని పళనిస్వామి వెల్లడించారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. AIADMK మూడో విడత హామీల విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (Tamil Nadu Assembly Elections) జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యక్ష ప్రచారాన్ని ప్రారంభించాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక వాగ్దానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో AIADMK మూడో విడత ఎన్నికల హామీలను విడుదల చేశారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి మంగళవారం తన పార్టీ తరపున మూడో విడత ఎన్నికల వాగ్దానాలను ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత జయంతిని పురస్కరించుకుని ఈ కీలక ప్రకటనలు చేశారు. ప్రస్తుత డీఎంకే పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఏఐఏడీఎంకే అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ. 10,000 ఒకేసారి ఎక్స్‌గ్రేషియాగా అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అంతేకాకుండా, నిరుద్యోగుల కోసం పళనిస్వామి భారీ తాయిలాలు ప్రకటించారు. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజీలలో పేరు నమోదు చేసుకుని ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న డిగ్రీ పట్టభద్రులకు నెలకు రూ. 2,000 చొప్పున స్టైపెండ్ అందిస్తామని తెలిపారు. అదేవిధంగా 10, ప్లస్ టూ (ఇంటర్మీడియట్) వరకు చదివి ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజీలో రిజిస్టర్ చేసుకున్న వారికి నెలకు రూ. 1,000 నిరుద్యోగ భృతి కల్పిస్తామని పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

డీఎంకే వైఫల్యాలను ఎండగడుతూనే, మహిళలు, యువతను ఆకర్షించేలా ఈ హామీలు ఉన్నాయి. జయలలిత ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తమ పార్టీ కట్టుబడి ఉంటుందని పళనిస్వామి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ కొత్త హామీలు తమిళనాడు రాజకీయాల్లో వేడిని పెంచాయి.

Next Story