గోదావరి పుష్కరాలపై పవన్ సూచనలు పరిగణనలోకి తీసుకోండి: సీఎం చంద్రబాబు

by Malleboina Mahesh |

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష. 6 జిల్లాల్లో 525 ఘాట్ల ఏర్పాటుకు ఆదేశం. పవన్ కళ్యాణ్ సూచనలు పాటించాలని స్పష్టీకరణ.

గోదావరి పుష్కరాలపై పవన్ సూచనలు పరిగణనలోకి తీసుకోండి: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: మరికొద్ది రోజుల్లో గోదావరి పుష్కరాలు (Godavari Pushkaralu) రాబోతుండటంతో ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా గోదావరి పుష్కరాల నిర్వహణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ పుష్కరాల మహోత్సవానికి సుమారు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్ల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనలను, సలహాలను ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే, గోదావరి పరివాహక ప్రాంతంలోని 6 జిల్లాల్లో కలిపి మొత్తం 525 ఘాట్లను (Pushkar Ghats) భక్తుల కోసం సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో రాజమండ్రి (రాజమహేంద్రవరం) నగరాభివృద్ధిపై సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. చారిత్రాత్మక నగరమైన రాజమండ్రిని ‘మెగా సిటీ గా అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. దీంతో పాటు, రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ గోదావరి పుష్కరాల ప్రారంభానికి ముందే పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేసి, దానిని జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

Next Story