'మా రక్తం తీసుకో.. రైతన్నకు నీళ్ళివ్వు'.. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ నేతల రక్తదానం

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా పంటల సాగుకు కాళేశ్వరం నీళ్లు విడుదల చేయాలని కోరినందుకు.. పంట పొలాల్లో రక్తాన్ని చల్లాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో గురువారం వినూత్న రక్తదాన నిరసన కార్యక్రమం నిర్వహించారు.

మా రక్తం తీసుకో.. రైతన్నకు నీళ్ళివ్వు.. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ నేతల రక్తదానం
X

దిశ, గంగాధర: రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా పంటల సాగుకు కాళేశ్వరం నీళ్లు విడుదల చేయాలని కోరినందుకు.. పంట పొలాల్లో రక్తాన్ని చల్లాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో గురువారం వినూత్న రక్తదాన నిరసన కార్యక్రమం నిర్వహించారు. గంగాధర మండలం మధురానగర్‌లో ఏర్పాటు చేసిన ఈ నిరసనలో.. "రేవంత్ రెడ్డి.. మా రక్తం ఎంతైనా ఇస్తాం.. మా రైతన్నలకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వు" అంటూ బీఆర్ఎస్ నాయకులు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేసిన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే, నీళ్లు ఎత్తి పోయకుండా సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. వానాకాలం సాగు ప్రారంభమై నెల దాటిన చినుకు పడక వ్యవసాయం ఆగమవుతుందని, రైతుల పెట్టుబడులు పెట్టి మునిగిపోతున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్‌ను సందర్శించి దిగువకు వృథాగా పోతున్న నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారన్నారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. పంట పొలాలకు నీళ్లు కాదు, బీఆర్ఎస్ నేతల రక్తం పారించాలంటూ మాట్లాడటం హింసను ప్రేరేపించేలా ఉందన్నారు. బాధ్యతగల పదవిలో ఉండి ఇలా మాట్లాడటం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు.

'కేసీఆర్ పై కోపంతో రైతన్న ఉసురు తీయకు.. మా రక్తం తీసుకో, రైతులకు నీళ్లు ఇవ్వు రేవంత్ రెడ్డి' అంటూ రవిశంకర్ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పంతాలకు పోకుండా వెంటనే కాళేశ్వరం నీటిని విడుదల చేసి ఎండిపోతున్న సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ రవీందర్ రెడ్డి, నియోజకవర్గ, మండల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story