సర్ తో తహసిల్దార్లకు తప్పని తంటాలు

by Ratna Kumari |

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (సర్) కార్యక్రమం తహసీల్దార్లకు తంటాలుగా మారింది.

సర్ తో తహసిల్దార్లకు తప్పని తంటాలు
X

దిశ, మణుగూరు : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (సర్) కార్యక్రమం తహసీల్దార్లకు తంటాలుగా మారింది. కింది స్థాయి అధికారులు, బి ఎల్ వో ల పై తహసిల్దార్లు ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నారు. దీంతో సర్ కార్యక్రమం తాసిల్దార్లకు సవాల్ గా మారింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు కల్పించడం, నకిలీ/తొలగింపు ఓట్లను ఏరివేయడంలో సిబ్బంది కొరత, క్షేత్రస్థాయి పరిశీలన, బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి సేకరించిన వివరాలను పర్యవేక్షించడం, తప్పులు దొర్లకుండా చూడటం తహసీల్దార్లకు అదనపు భారంగా మారింది. దీంతో సమయం లేకపోవడం, రోజూవారీ రెవెన్యూ కార్యక్రమాలు, ధ్రువపత్రాల జారీ వంటి పనులకు అంతరాయం కలుగుతోంది.

నిర్దేశిత గడువులోగా పూర్తి స్థాయి ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ పూర్తి చేయాల్సి ఉండటంతో ఉన్నతాధికారుల నుండి తీవ్రమైన ఒత్తిడి ఉంటోంది. ఓటర్లు బీ ఎల్ వో లకు సరైన వివరాలు ఇవ్వకపోవడం, తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల సర్ ప్రక్రియలో తీవ్ర జాప్యం, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అన్ని పనులు ఒకేసారి చెప్పడంతో తహసిల్దార్లకు తలపై మోయలేని భారంగా మారింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో తహసీల్దార్ లు ఇబ్బందులు పడుతున్నారు. ఆఖరికి కొంతమంది విద్యార్థులను తీసుకువచ్చి సర్ కార్యక్రమం చేయిస్తున్నారు. పై అధికారుల ఒత్తిడితో తహసిల్దార్లు ఉక్కిరి బిక్కిరి అయి అనారోగ్యం పాలైన సంఘటనలు కూడా ఉన్నాయి. అసలే ఒకపక్క సర్ కార్యక్రమం, ఇతర పనులు పూర్తి కాలేదు అంటే మరోపక్క వరుసగా మంత్రుల పర్యటనలు, ప్రోటోకాల్ తో ఊపిరి పీల్చుకోలేని విధంగా తయారైంది తహసీల్దార్ ల పరిస్థితి. పై అధికారులు పునరాలోచించి సర్ కార్యక్రమంలో ఉపాద్యాయులను భాగస్వాములను చేస్తే కార్యక్రమం త్వరగా పూర్తవుతుందని పలువురు ప్రముఖులు వాపోతున్నారు.

Next Story