- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాడ్వాయి ‘ప్రజావాణి’లో అంకెల గారడీ.. అధికారుల గైర్హాజరుపై వెల్లువెత్తుతున్న నిరసన!
తాడ్వాయి ప్రజావాణిలో అధికారుల గైర్హాజరు! గత వారం ఇద్దరు, ఈ వారం తొమ్మిదే హాజరు. ఖాళీ కుర్చీలకే ప్రజల అర్జీలు. కలెక్టర్ చర్యలకు డిమాండ్.

దిశ, తాడ్వాయి : ప్రజల కష్టాలను తీర్చాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమం తాడ్వాయి మండలంలో అంకెల గారడీలా మారింది. అధికారులు ఈ కార్యక్రమానికి రావడాన్ని బాధ్యతగా కాకుండా ఏదో లక్కీ డ్రాలా భావిస్తున్నట్లు కనిపిస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. గత సోమవారం కేవలం ఇద్దరు అధికారులు మాత్రమే హాజరై రికార్డు సృష్టించగా, ఈ వారం ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. మండలంలో డజన్ల కొద్దీ శాఖలు ఉన్నా, అధికారుల రాక గగనమవ్వడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అధికారులందరూ కలిసి దర్శనమివ్వడానికి మరో ఏడాది పడుతుందేమోనని అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలు వెటకారంగా చర్చించుకుంటున్నారు.
హాజరైన అధికారులు వీరే..
ఈ వారం ప్రజావాణికి తహశీల్దార్ శ్వేత, ఎంపీడీఓ సవిత, ఏపీఎం రాజు, హౌసింగ్ ఏఈ సుచిత్ర, ఇరిగేషన్ ఏఈ మధు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ప్రశాంత్, ఐసీడీఎస్ వనజ, హెల్త్ సూపర్ వైజర్ సరస్వతి మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ప్రధాన శాఖల అధికారుల కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. వ్యవసాయశాఖ ఏఓ ఫీల్డ్‌లో ఉన్నారని, మండల విద్యాశాఖ అధికారి సెలవులో ఉన్నారని సాకులు చెబుతుండగా, మిగతా శాఖల అధికారులు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది. సామాన్యుల గోడు వినే తీరిక కూడా అధికారులకు లేదా అని బాధితులు విరుచుకుపడుతున్నారు.
ఖాళీ కుర్చీలే దిక్కు!
గ్రామాల నుంచి పనులు మానుకొని అర్జీలు పట్టుకొచ్చిన బాధితులకు అక్కడ అధికారులకు బదులు ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయి. ‘గత వారం ఇద్దరు, ఈ వారం తొమ్మిది.. మరి అందరూ ఎప్పుడు వస్తారు సార్?’ అంటూ ప్రజలు అధికారుల హాజరు తీరును ప్రశ్నిస్తున్నారు. వారానికోసారి జరిగే ఈ కార్యక్రమంలోనే గైర్హాజరు ఇలా ఉంటే, క్షేత్రస్థాయిలో పాలన ఎంత గాలికి వదిలేశారో అర్థమవుతోందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి, గైర్హాజరైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వచ్చే వారం నుంచి అన్నిశాఖల అధికారులు హాజరయ్యేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.






