- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండుగ వేళ నేతన్నలకు తీపికబురు.. రుణమాఫీకి రూ.16 కోట్ల నిధులు విడుదల
రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ‘చేనేత కార్మికుల రుణమాఫీ పథకం’ (Loan Waivers to Handloom Weavers Scheme) అమలులో భాగంగా, గతంలో కేటాయించిన బడ్జెట్‌కు అదనంగా మరో రూ.16,27,60,000 కోట్ల నిధులు మంజూరు చేస్తూ తాజాగా ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, చేనేత కార్మికుల పాత రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం గతంలో రూ. 33 కోట్లను కేటాయించింది. అయితే, లబ్ధిదారుల సంఖ్య పెరగడంతో అసలు అప్పు మొత్తం రూ.48.30 కోట్లకు చేరిందని చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు పెరిగిన అప్పును మరియు పథకం నిర్వహణ ఖర్చులను కలుపుకుని అదనపు నిధులు కావాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు పలు జిల్లాల్లో రుణమాఫీ నిధులు విడుదల చేయాలంటూ చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. దీంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం 2025-26 బడ్జెట్ అంచనాల నుంచి ఈ నిధులను విడుదల చేస్తూ పరిశ్రమలు, వాణిజ్య, టెక్స్‌టైల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ (Shailaja Ramayyar) జీవోను విడుదల చేశారు. తాజాగా మంజూరైన రూ.16.27 కోట్ల నిధులతో చేనేత కార్మికులకు రుణ విముక్తి కలుగనుంది. నిధుల్లో 2 శాతం నిధులను పథకం అమలు కోసం అయ్యే పరిపాలనా ఖర్చుల నిమిత్తం వినియోగించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది నేతన్నల కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుల భారం తగ్గి, కొత్తగా బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం కలుగుతుందని నేతన్నలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






