- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజురాబాద్‌లో మహిళ అనుమానాస్పద మృతి
హుజురాబాద్ పట్టణంలో ఓ మహిళ బావిలో మృతదేహంగా కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ పట్టణంలో ఓ మహిళ బావిలో మృతదేహంగా కనిపించడం కలకలం రేపింది. మృతదేహం మెడకు నవారు పట్టె బిగించి ఉండటంతో ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, పోలీసులు హత్యతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం, హుజురాబాద్ పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలోని ఓ బావిలో మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సీఐ కరుణాకర్, ఎస్సైలు రవి, కృష్ణారావు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీశారు.
మృతురాలిని చింత సునీత (45)గా గుర్తించారు. భర్త గతంలోనే మృతి చెందగా, ఇద్దరు పిల్లలతో కలిసి హుజురాబాద్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పరిశీలించగా సునీత మెడకు నవారు పట్టె బలంగా చుట్టి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరణానికి గల ఖచ్చితమైన కారణం పోస్టుమార్టం నివేదిక అనంతరం మాత్రమే తేలుతుందని పోలీసులు స్పష్టం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలికితీయాలని, నేరం జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






