షాబాద్‌లో ఆరుగురి దారుణ హత్య: ఎన్‌హెచ్ఆర్‌సీ (NHRC)ని ఆశ్రయించిన న్యాయవాది

by Malleboina Mahesh |

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ ఆరుగురి హత్యల ఘటనపై ఎన్‌హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు.. సీఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేష్‌లపై చర్యలు కోరిన లాయర్ రామారావు!

షాబాద్‌లో ఆరుగురి దారుణ హత్య: ఎన్‌హెచ్ఆర్‌సీ (NHRC)ని ఆశ్రయించిన న్యాయవాది
X

దిశ, వెబ్ డెస్క్: పోక్సో కేసులు జైలుకెళ్లిన వ్యక్తి.. బెయిల్ పై వచ్చి ఆరుగురిని హత్య చేయడం తెలంగాణలో సంచలనంగా మారింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. శనివారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. సంచలనం సృష్టించిన ఆరుగురి దారుణ హత్యల ఉదంతం పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) లో ఫిర్యాదు నమోదైంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది రామారావు ఎన్‌హెచ్ఆర్‌సీకి లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు.

పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఘోరం..?

నిందితుడి ప్రవర్తన, ముప్పు గురించి బాధితులు గతంలోనే పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ, షాబాద్ పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని న్యాయవాది రామారావు తన ఫిర్యాదులో ఆరోపించారు. స్థానిక సీఐ (CI) కాంతారెడ్డి, ఎస్ఐ (SI) రమేష్‌లు సకాలంలో స్పందించి ఉంటే ఆరుగురు అమాయకుల ప్రాణాలు దక్కేవని ఆయన పేర్కొన్నారు. పోలీసుల ఉదాసీనత వల్లే నిందితుడు ఇంతటి ఘాతుకానికి తెగబడ్డాడని, కాబట్టి విధి నిర్వహణలో వైఫల్యం చెందిన సదరు సీఐ, ఎస్ఐలను వెంటనే సస్పెండ్ చేసి వారిపై శాఖాపరమైన విచారణ జరపాలని, అలాగే ఆరుగురిని పొట్టనబెట్టుకున్న నిందితుడికి కఠిన శిక్ష పడేలా కమిషన్ జోక్యం చేసుకోవాలని న్యాయవాది రామారావు ఎన్‌హెచ్ఆర్‌సీని అభ్యర్థించారు.

Next Story