హుజూర్‌నగర్‌కు రూ.3.52 కోట్లతో నూతన ఆర్టీసీ బస్టాండ్..

by Batti.Sumithra |

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

హుజూర్‌నగర్‌కు రూ.3.52 కోట్లతో నూతన ఆర్టీసీ బస్టాండ్..
X

దిశ, హుజూర్‌నగర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుజూర్‌నగర్‌లో రూ.3.52 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్టాండ్‌కు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి శనివారం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.11 వేల కోట్ల విలువైన ప్రయాణాలు జరిగాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటికే 2,800 కొత్త బస్సులు కొనుగోలు చేశామని, మరో 3,500 మందికి ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహకారంతో ఆర్టీసీని అన్ని విధాలుగా బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ప్రతిరోజూ సుమారు 60 లక్షల కిలోమీటర్లు బస్సులు నడిపిస్తూ ప్రజలకు సేవలందిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతిగ్రామానికి ఆర్టీసీ బస్సు సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని సాగునీటితో సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. బస్టాండ్ల అభివృద్ధి, ఆధునీకరణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, హుజూర్‌నగర్ నూతన బస్టాండ్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు పై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. నిపుణులు ప్రాజెక్టు నిర్మాణం పై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులు వాస్తవాలను పక్కనబెట్టి విమర్శలు చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాల వల్లే కాళేశ్వరం సమస్యలు తలెత్తాయని విమర్శించారు. గతంలో నీటిపారుదల శాఖను నిర్వహించిన మంత్రులతో పోలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమర్థంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.

Next Story