గిరిజన విద్యకు గోల్డెన్ గేట్‌వే... ఇల్లెందులో ఇంటిగ్రేటెడ్ స్కూల్

by Taduka Kalyani |

గిరిజన ప్రాంతాల విద్యార్థులను జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేసి అత్యున్నత విద్యా ప్రమాణాలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇల్లెందులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయనుంది.

గిరిజన విద్యకు గోల్డెన్ గేట్‌వే... ఇల్లెందులో ఇంటిగ్రేటెడ్ స్కూల్
X

దిశ, ఇల్లెందు: గిరిజన ప్రాంతాల విద్యార్థులను జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేసి అత్యున్నత విద్యా ప్రమాణాలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇల్లెందులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయనుంది. ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్‌లో విద్యను అందించే ఈ పాఠశాలలో ఆధునిక బోధన, అత్యాధునిక ప్రయోగశాలలు, డిజిటల్ తరగతి గదులు, నాణ్యమైన వసతి, పోషకాహారం, క్రీడా సదుపాయాలు, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందించనున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంత విద్యార్థులకు ఇది ఉన్నత విద్య వైపు బలమైన వేదికగా నిలవనుంది.

ఉన్నత విద్యకు సమగ్ర ప్రణాళిక

ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లో విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల బోధన మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానం, ఆంగ్ల భాషా ప్రావీణ్యం, నాయకత్వ లక్షణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంత విద్యార్థులు కూడా దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధించేలా ప్రత్యేక అకడమిక్ విధానాన్ని అమలు చేయనున్నారు.

ఐదో తరగతి నుంచే ప్రవేశాలు... ఇంటర్ వరకు ఒకే క్యాంపస్

ఈ విద్యాసంస్థలో ఐదో తరగతి నుంచే ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఇంటర్మీడియట్ వరకు నిరంతర విద్యను అందిస్తూ మధ్యలో పాఠశాలలు మారాల్సిన అవసరం లేకుండా ఒకే ప్రాంగణంలో విద్యాభ్యాసం కొనసాగించే విధంగా ప్రణాళిక రూపొందించారు. బాలురు, బాలికలకు ప్రత్యేక హాస్టళ్లు, భద్రతా ఏర్పాట్లు ఉండనున్నాయి.

నీట్ – ఐఐటీ లక్ష్యంగా ప్రత్యేక కోచింగ్

ఇంటర్మీడియట్ చదువుతో పాటు నీట్, జేఈఈ (ఐఐటీ), ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక నిపుణులతో శిక్షణ అందించనున్నారు. కాన్సెప్ట్ ఆధారిత బోధన, వారానికో పరీక్ష, డిజిటల్ లెర్నింగ్, డౌట్ క్లియరింగ్ సెషన్లు, మాక్ టెస్టుల ద్వారా విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయనున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా బోధన ఉండనుందని అధికారులు చెబుతున్నారు.

క్రీడలు – సాంస్కృతిక రంగాలకు సమాన ప్రాధాన్యం

చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, క్రికెట్, ఫుట్‌బాల్, ఇండోర్ గేమ్స్‌తో పాటు యోగా, ఫిట్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం, నృత్యం, కళారూపాల్లోనూ విద్యార్థుల ప్రతిభను వెలికితీసేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

ఆధునిక వసతులతో క్యాంపస్

ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లో స్మార్ట్ క్లాస్‌రూమ్స్, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ లైబ్రరీ, డైనింగ్ హాల్, ఆరోగ్య కేంద్రం, విశాలమైన క్రీడా మైదానాలు, హాస్టళ్లు, సీసీ కెమెరా భద్రత, తాగునీరు, పారిశుద్ధ్య వసతులు వంటి అన్ని సౌకర్యాలను కల్పించనున్నారు. విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

కోట్ల రూపాయలతో నిర్మాణం

ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను అత్యున్నత ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో ప్రణాళిక రూపొందించింది. విశాలమైన క్యాంపస్, ఆధునిక విద్యా భవనాలు, హాస్టళ్లు, క్రీడా మైదానాలు, ప్రయోగశాలలు, పరిపాలనా భవనాల నిర్మాణానికి భారీ నిధులు కేటాయించనుంది. పనులు పూర్తయిన తర్వాత ఇది రాష్ట్రంలో ఆదర్శ విద్యాసంస్థల్లో ఒకటిగా నిలిచే అవకాశముంది.

ప్రవేశాలకు నిబంధనలు

ప్రవేశాలు పూర్తిగా ప్రభుత్వం నిర్ణయించే నిబంధనల ప్రకారమే ఉంటాయి. ప్రతిభా పరీక్ష లేదా ప్రభుత్వం నిర్దేశించే ఎంపిక విధానం ద్వారా విద్యార్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో చదివే అర్హులైన విద్యార్థులకు ప్రాధాన్యం కల్పించే అవకాశముందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

గిరిజన విద్యార్థులకు వరం

ఇప్పటి వరకు ఉన్నత విద్య, పోటీ పరీక్షల కోచింగ్ కోసం నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండగా, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుతో గిరిజన ప్రాంత విద్యార్థులకు తమ ప్రాంతంలోనే నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇది గొప్ప ఊరటనివ్వడంతో పాటు, గిరిజన విద్యార్థులు వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, సివిల్ సర్వెంట్లుగా ఎదిగే అవకాశాలను మరింత విస్తరించనుంది. ఇల్లెందులో ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఏర్పాటు కావడం గిరిజన ప్రాంత విద్యా చరిత్రలో ఒక కీలక మైలురాయిగా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఇల్లందులో ప్రారంభమైన నిర్మాణ పనులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల విద్యార్థులను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని సదుద్దేశంతో సకల సౌకర్యాలతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇల్లెందు పట్టణంలోని బైపాస్ సమీపంలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రెండు నుంచి మూడేళ్లలో ఈ భవన నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పూర్తయితే గిరిజన విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థులకు సమాన అవకాశాలు ఈ పాఠశాలలో కల్పించనున్నారు. గిరిజన ప్రాంత ప్రతిభావంతులైన విద్యార్థులకు వారి లక్ష్యాలను చేరుకునే విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాల తర్ఫీదు ఇవ్వనుంది. ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇల్లందులో ప్రారంభం కావడం పట్ల మేధావులు, పుర ప్రజలు, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story