పోలీసు, ప్రభుత్వ నిర్లక్ష్యం వైఫల్యంతోనే ఆరుగురు ప్రాణాలు బలి

by Taduka Kalyani |

హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ధ్వజమెత్తారు.

పోలీసు, ప్రభుత్వ నిర్లక్ష్యం వైఫల్యంతోనే ఆరుగురు ప్రాణాలు బలి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందన్నారు. నైతిక విలువలు ఉంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి తక్షణమే తన ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లను ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడానికి, ల్యాండ్ సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా మార్చేశారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఒక ఫోక్సో కేసు నిందితుడు ముగ్గురు పసిపిల్లలతో సహా ఆరుగురి ని కిరాతకంగా చంపేయడం రాష్ట్ర ప్రభుత్వ, పోలీసుల వైఫల్యానికి సజీవ సాక్ష్యం అన్నారు. హృదయ విదారక సంఘటన ప్రతి మధ్యతరగతి, పేద కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసిందన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లిదండ్రులందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. గత నెల మే 16న ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే.. నిందితుడిని అరెస్ట్ చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. అవినీతికి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు.. నిందితుడికి కేవలం ఏడేళ్ల లోపు శిక్ష పడే సాధారణ సెక్షన్లు పెట్టి కాపాడే ప్రయత్నం చేశారన్నారు. నెల రోజుల పాటు అతన్ని అరెస్ట్ చేయకుండా వదిలేయడంతో.. అతను కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని ఈరోజు ఆ కుటుంబాన్నే అంతం చేశాడన్నారు. ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి అని ఆ బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ కిరాతక ఘటన లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబంలో మిగిలిన వికలాంగ చిన్నారి పేరు మీద ప్రభుత్వం వెంటనే కోటి రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేసి ఆ అమ్మాయిని పెంచి, సంరక్షించే పూర్తి బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. పరారీలో ఉన్న నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినాతి కఠినమైన శిక్ష విధించాలన్నారు. పరామర్శకు వెళుతున్న సమయంలో అరెస్టు చేసిన బీఆర్ఎస్ మహిళా నాయకులను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జాప శ్రీకాంత్ రెడ్డి, కోల రమేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story