హైదరాబాద్‌కు ఎమిరేట్స్ 'A-380' విమానాలు.. సీఎంతో సంస్థ వైస్ ప్రెసిడెంట్ కీలక భేటీ

by Prasad Jukanti |   (  Updated:2026-07-11 12:12:35  IST  )

హైదరాబాద్ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ విమానం 'ఎమిరేట్స్ A-380' సర్వీసులు ప్రారంభించేందుకు ఎమిరేట్స్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది.

హైదరాబాద్‌కు ఎమిరేట్స్ A-380 విమానాలు.. సీఎంతో సంస్థ వైస్ ప్రెసిడెంట్ కీలక భేటీ
X

దిశ,డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ విమానయాన రంగంలో హైదరాబాద్ మరో కీలక మైలురాయిని అందుకోబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ ప్రయాణీకుల విమానమైన 'ఎమిరేట్స్ A-380' సర్వీసులను హైదరాబాద్ నుంచి ప్రారంభించేందుకు ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎమిరేట్స్ సానుకూలత వ్యక్తం చేసింది. శనివారం ఎమిరేట్స్ విమానయాన సంస్థ (ఇండియా - నేపాల్) వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హన్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమిరేట్స్ విమానయాన సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.

వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులపై సీఎం ఫోకస్

హైదరాబాద్‌లో ఎమిరేట్స్ A-380 సర్వీసులను ప్రారంభించడంతో పాటు సంస్థ విమాన సర్వీసులను మరిన్ని పెంచాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. అలాగే తెలంగాణలో కొత్తగా అభివృద్ధి చేయ తలపెట్టిన వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల ప్రాధాన్యతను ముఖ్యమంత్రి ఈ భేటీలో వివరించారు. రాష్ట్రంలో విమానయాన రంగానికి ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకుంటూ, తెలంగాణలోనే ఎమిరేట్స్ సంస్థకు సంబంధించిన MRO (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్) ఆపరేషన్స్‌ను ప్రారంభించాలని కోరారు. .

గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీకి స్పాన్సర్‌షిప్:

విమానయాన రంగానికే పరిమితం కాకుండా, గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించేందుకు స్పాన్సర్‌షిప్ ఇవ్వాల్సిందిగా ఎమిరేట్స్ యాజమాన్యాన్ని సీఎం కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ సర్వీసులను ప్రారంభించడానికి మహమ్మద్ సర్హన్ సానుకూలతను వ్యక్తం చేశారు. అలాగే క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో స్పాన్సర్‌షిప్ అందించడంపైన వారు సానుకూలంగా స్పందించారు. ఈ భేటీతో రాబోయే రోజుల్లో తెలంగాణకు అంతర్జాతీయ పెట్టుబడులు, విమాన సర్వీసులు మరింత పెరిగే అవకాశం ఉంది.

Next Story