- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘స్లీపర్ సెల్స్’ పాక్ గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలు.. 102 మందిపై మహారాష్ట్ర ఏటీఎస్ నిఘా!
పాకిస్థానీ గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టితో సంబంధాలున్నాయనే అనుమానంతో మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) 102 మందిపై నిఘా పెట్టింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పాకిస్థానీ గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టితో సంబంధాలున్నాయనే అనుమానంతో మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) 102 మందిపై నిఘా పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 14 ఏటీఎస్ యూనిట్లకు చెందిన 58 బృందాలు ఈ భారీ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. భారతీయ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు షాజాద్ ముఠా పన్నుతున్న కుట్రలను భగ్నం చేసే దిశగా అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
యువతకు వల వేస్తున్నదిలా..
భారత్‌లో ఉగ్ర నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు షాజాద్ భట్టితో పాటు అతని అనుచరులైన అబిద్ జాట్, అజ్మల్ గుజ్జర్, హమ్మద్ మెమన్, రాణా హునైన్ తదితరులు సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా వాడుకుంటున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీరు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, టెలిగ్రామ్ ద్వారా యువతతో పరిచయాలు పెంచుకుంటున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ, పేద యువతను లక్ష్యంగా చేసుకుని.. చిన్న పనులకే సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆశచూపుతూ ఉగ్ర కార్యకలాపాల వైపు లాగుతున్నట్లు సమాచారం.
‘స్లీపర్ సెల్స్’గా మార్చడమే టార్గెట్!
ఆకర్షితులైన యువతను ‘స్లీపర్ సెల్స్’గా మార్చి, వారి ద్వారా ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని సేకరించడం, డ్రగ్స్ రవాణా, అక్రమ ఆయుధాల తరలింపు వంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు.
తల్లిదండ్రులకు ఏటీఎస్ సూచనలు..
పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలు, వారి ప్రవర్తనలో వచ్చే ఆకస్మిక మార్పులపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని ఏటీఎస్ సూచించింది. పిల్లలు ఆన్‌లైన్‌లో అనుమానాస్పద వ్యక్తులతో సంభాషిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరింది. సామాజిక సామరస్యాన్ని, జాతీయ సమగ్రతను దెబ్బతీసే ఎలాంటి పోస్టులను పౌరులు షేర్ చేయవద్దని పోలీసులు సూచించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు తీవ్రంగా హెచ్చరించారు.






