తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయండి.. గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి

by Prasad Jukanti |   (  Updated:2026-07-11 11:22:52  IST  )

కేరళ, గుజరాత్ తరహాలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (TAS) ఏర్పాటు చేయాలని గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది.

తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయండి..  గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని గ్రూప్-1 సర్వీస్‍లతో స్టేట్ సివిల్ సర్వీస్ ఏర్పాటు చేయాలని తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇవాళ తెలంగాణ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆన్‍లైన్ ద్వారా జరిగింది. ఈ సమావేశం‍లో చంద్ర శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రూప్-1 ఆఫీసర్స్ కు ఆయా శాఖలు, కార్పొరేషన్లలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

కేరళ, గుజరాత్ తరహాలోనే 'టాస్' (TAS):

కేరళ, ఒడిశా, గుజరాత్ వంటి రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలో కూడా 'తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్' ను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. ప్రస్తుతం ఐఏఎస్ పదోన్నతులలో కేవలం రెవిన్యూ శాఖనే 'స్టేట్ సివిల్ సర్వీస్'గా పరిగణిస్తున్నారని, దీనివల్ల గ్రూప్-1 పరిధిలోని ఇతర శాఖల అధికారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న పంచాయత్ రాజ్, మున్సిపల్ శాఖల సీనియర్ గ్రూప్-1 అధికారులను జిల్లాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా (Additional Collectors - Local Bodies) నియమించాలని, అన్ని శాఖల్లోని గ్రూప్-1 అధికారులకు కాలపరిమితితో కూడిన (Time-Bound) పదోన్నతులు, అన్ని సర్వీసులకు సమాన వేతనాలు ఉండేలా చూడాలన్నారు. గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

త్వరలో సీఎం దృష్టికి:

త్వరలో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర సంబంధిత అధికారులను కలిసి తమ విజ్ఞప్తులను వారి దృష్టికి తీసుకుని వెళ్ళాలని ఈ సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హన్మంత్ నాయక్, ఇతర గ్రూప్-1 అధికారులు సయ్యద్ యాసిన్ ఖురేషి, అరవింద రెడ్డి, శశిధరా చారి, హరికిషన్, భవాని, రమేష్ కుమార్, సోమ శేఖర్, భరత్ రెడ్డి,పద్మజ, మైత్రి ప్రియ, నూతనంగా ఎంపికైన 2025 బ్యాచ్ గ్రూప్-1 ఆఫీసర్స్ తో పాటు వివిధ శాఖలకు చెందిన 300 కు పైగా గ్రూప్ 1 అధికారులు పాల్గొన్నారు .

Next Story