రాత్రి వేళ డీఏపీ విక్రయాలపై అనుమానాలు.. నకిలీవని రైతుల ఆరోపణలు

by Batti.Sumithra |

వానాకాల సాగు సీజన్‌లో రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ డీఏపీ ఎరువులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామంలో కలకలం రేపుతున్నాయి.

రాత్రి వేళ డీఏపీ విక్రయాలపై అనుమానాలు.. నకిలీవని రైతుల ఆరోపణలు
X

దిశ, మఠంపల్లి : వానాకాల సాగు సీజన్‌లో రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ డీఏపీ ఎరువులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామంలో కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని ఓ రైతు ద్వారా ప్రైవేట్ డీలర్ సహకారంతో ఈ ఎరువులను రాత్రి వేళల్లో విక్రయించినట్లు గ్రామస్థులు, రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే సమయంలో రైతులు అధికంగా వినియోగించే డీఏపీ ఎరువుల కొరత నెలకొన్న నేపథ్యంలో, మార్కెట్‌లో బస్తా ధర సుమారు రూ.1,350 ఉండగా, ఒక్కో బస్తాను రూ.1,500 చొప్పున చుట్టుపక్కల గ్రామాల రైతులకు రాత్రి సుమారు 8 గంటల సమయంలో విక్రయించినట్లు సమాచారం. నాలుగు, ఐదు తేదీల్లో సుమారు ఆరు లోడ్ల మేర ఈ ఎరువులను విక్రయించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

మరోవైపు, ప్రస్తుతం మఠంపల్లి మండల పరిధిలోని ప్రైవేట్ ఎరువుల డీలర్ల వద్ద డీఏపీ నిల్వలు అందుబాటులో లేని పరిస్థితుల్లో, ఒక రైతు వద్ద మాత్రమే భారీ మొత్తంలో డీఏపీ ఎలా లభించిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓ ప్రైవేట్ డీలర్‌తో కుమ్మక్కై ఒక్కో బస్తాపై సుమారు రూ.150 కమిషన్ తీసుకుని విక్రయించినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఎరువులు అసలు డీఏపీ కాదని, నకిలీవేనని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఒరిజినల్ డీఏపీకి దుర్వాసన ఉండదని, కానీ విక్రయించిన ఎరువుల నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తోందని చెబుతున్నారు. అంతేకాకుండా, నీటిలో వేస్తే సరిగా కరగడం లేదని రైతులు పేర్కొంటున్నారు. రాత్రి వేళల్లో రహస్యంగా విక్రయించడం కూడా అనుమానాలకు తావిస్తోందని గ్రామస్థులు అంటున్నారు. కొన్ని రోజులుగా ఈ వ్యవహారం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ముందుగానే స్పందించలేదని రైతులు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మఠంపల్లి వ్యవసాయ అధికారి శ్రీనివాస్ వివరణ...

డీఏపీ ఎరువుల నమూనాలను సేకరించి, సంబంధిత కంపెనీ ప్రతినిధులతో పాటు పరీక్షా కేంద్రానికి పంపించామని, ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాతే అవి నకిలీవా, నాణ్యమైనవా అనేది నిర్ధారణ అవుతుందని మఠంపల్లి వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. రైతులు సహకరించి పూర్తి వివరాలు అందిస్తే విచారణ వేగవంతం అవుతుందని చెప్పారు. అలాగే ధృవీకరణ లేని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయవద్దని, నకిలీ ఎరువులు వాడితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Next Story