- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షాభావంతో నారాయణపేటలో దూదిపూల దుఃఖం
నైరుతి రుతుపవనాలపై ఆశలు పెట్టుకున్న నారాయణపేట జిల్లా రైతులకు ఈసారి వర్షాభావం తీవ్ర నిరాశను మిగిల్చింది.

దిశ, నారాయణపేట : నైరుతి రుతుపవనాలపై ఆశలు పెట్టుకున్న నారాయణపేట జిల్లా రైతులకు ఈసారి వర్షాభావం తీవ్ర నిరాశను మిగిల్చింది. జూన్ నెలలో కురిసిన తొలి వర్షాలతో సాగు చేసిన పత్తి పంటకు ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పంట వాడిపోతుండగా, రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన రైతులు ఈ ఏడాది కూడా పత్తి సాగుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 1,58,296 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా, మక్తల్, ఊట్కూర్, ధన్వాడ, మరికల్, నారాయణపేట, నర్వ మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు జరిగింది.
రైతుల కథనం ప్రకారం, జూన్‌లో కురిసిన వర్షాలతో విత్తనాలు నాటినా, గత నెల రోజులుగా వర్షాలు లేకపోవడంతో పాటు బలమైన గాలులు వీయడం వల్ల పత్తి మొక్కల ఎదుగుదల పూర్తిగా దెబ్బతింది. ఈ సమయానికి నాలుగు అడుగుల వరకు ఎదగాల్సిన మొక్కలు అడుగు ఎత్తు కూడా పెరగలేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు సుమారు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు చెబుతున్నారు. సకాలంలో వర్షాలు కురిసి ఉంటే మంచి దిగుబడులు వచ్చి క్వింటాల్‌కు రూ.10 వేల వరకు ధర లభిస్తుందనే ఆశతో సాగు చేశామని, కానీ ప్రస్తుతం పంట పూర్తిగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే సుమారు రూ.48 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు అంచనా వేస్తున్నారు. పత్తి మొక్కల్లో సుమారు 80 శాతం వరకు ప్రభావం కనిపిస్తోందని, మరో వారం రోజుల్లో కూడా వర్షాలు కురవకపోతే పంటను పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోవడంతో ప్రత్యామ్నాయంగా వరి సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదు. ఈ సమయానికి వరి నారుమడులు సిద్ధం చేసి నాట్లు ప్రారంభించాల్సి ఉండగా, వర్షాభావంతో ఆ అవకాశం కూడా కోల్పోయామని రైతులు తెలిపారు. పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు తగిన పరిహారం, ఆర్థిక సహాయం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.






