- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"మిస్ ట్రాన్స్‌జెండర్"గా సూర్య కుట్టీ
తమిళనాడులో ట్రాన్స్‌జెండర్ల అందాల పోటీలలో కోయంబత్తూరుకు చెందిన సూర్య కుట్టి 'మిస్ కూవాగం 2026' టైటిల్‌ను గెలుచుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులో ట్రాన్స్‌జెండర్ల అతిపెద్ద సాంస్కృతిక వేడుకైన కూవాగం ఉత్సవం ఈ ఏడాది కూడా అత్యంత అట్టహాసంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే అందాల పోటీలలో కోయంబత్తూరుకు చెందిన సూర్య కుట్టి 'మిస్ కూవాగం 2026' టైటిల్‌ను గెలుచుకుంది. విల్లుపురం జిల్లాలోని కూవాగం గ్రామంలో ఉన్న కూతాండవర్ దేవాలయం వేదికగా జరిగిన ఈ వేడుకల్లో వేలాది మంది ట్రాన్స్‌జెండర్లు పాల్గొన్నారు.
సత్తా చాటిన సూర్య కుట్టి
చిత్తిరై ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ అందాల పోటీలో దేశ విదేశాల నుంచి సుమారు 40 మంది ట్రాన్స్‌జెండర్ మహిళలు పాల్గొన్నారు. ర్యాంప్ వాక్, టాలెంట్ రౌండ్ మరియు ఈవినింగ్ గౌన్ రౌండ్లలో సూర్య కుట్టి తనదైన శైలిలో అద్భుత ప్రదర్శన ఇచ్చి న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో విజేతగా నిలిచిన సూర్యకు నిర్వాహకులు కిరీటాన్ని అలంకరించారు. టైటిల్ గెలిచిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తన విజయం తన సమాజానికి గర్వకారణమని, భవిష్యత్తులో ట్రాన్స్‌జెండర్ల హక్కులు, సామాజిక సమానత్వం కోసం శ్రమిస్తానని ఉద్వేగంగా వెల్లడించింది. కాగా మొదటి రన్నరప్ గా నిషా(మలేషియా) నిలవగా, సెకండ్ రన్నరప్ గా అనన్య(పుదుచ్చేరి) నిలిచింది.
"కూవాగం ఫెస్టివల్"
కూవాగం లేదా కూతాండవర్ ఫెస్టివల్ అనేది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, ఇది ట్రాన్స్‌జెండర్ సమాజం యొక్క ఆత్మగౌరవ ప్రతీక. మహాభారతంలోని అరవాన్ (కూతాండవర్) బలికి సంబంధించిన పురాణ గాథను అనుసరిస్తూ 18 రోజులపాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి కూడా వేలాది మంది ట్రాన్స్‌జెండర్లు ఇక్కడికి చేరుకుంటారు. ఒక రాత్రికి అరవాన్ దేవుడిని పెళ్లాడి, మరుసటి రోజున వితంతువులుగా మారి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి సంప్రదాయం.






