తుమ్మిడిహెట్టి డీపీఆర్ తయారీకి సర్వేలు.. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-21 16:03:33  IST  )

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులను కొనసాగించడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.

తుమ్మిడిహెట్టి డీపీఆర్ తయారీకి సర్వేలు.. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులను కొనసాగించడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై సెక్రెటేరియట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో టన్నెల్‌లో చిక్కుకున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ శకలాలను పూర్తిగా తొలగించామని, ప్రస్తుతం రైలు ట్రాక్ సహాయంతో మరమ్మతులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.

ప్రాజెక్టుల పురోగతిపై తరచూ సమీక్షిస్తూ పనుల వేగవంతానికి చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు పాటిస్తూనే నాణ్యతాప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రాజెక్టుల పూర్తికి సరిపడా నిధుల కేటాయింపునకు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించారని, యుద్ధప్రాతిపదికన పూర్తికి అధికారులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన బ్యారేజ్‌కు సంబంధించిన డీపీఆర్ తయారీ కోసం పూర్తిస్థాయిలో సర్వేలు, పరిశోధనలు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. బ్యారేజ్ ప్రాంతంలో అవసరమైన 73 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో టోపోగ్రాఫికల్ సర్వే పూర్తయిందని, దాంతోపాటు 85 కిలోమీటర్ల కాలువ సర్వేను సైతం పూర్తి చేశామని తెలిపారు. అదనంగా వార్దా, పెన్‌గంగా నదులకు ఇరువైపులా క్రాస్-సెక్షన్ లెవల్స్ సర్వే పూర్తి అయినందునా డీపీఆర్‌లకు తుదిరూపం ఇచ్చేందుకు కసరత్తు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

మేడిగడ్డ బ్యారేజీపై నివేదిక

కాళేశ్వరం బ్యారేజ్‌లకు సంబంధించి పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపై సైట్ తనిఖీ చేసి నివేదికను సమర్పించిందని మంత్రి తెలిపారు. ప్రణాళికలు ఇచ్చిందని చెప్పారు. బుధవారం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ముగ్గురు సభ్యులతో కూడిన బృందం అధ్యయనం ప్రారంభించగా.. మరో ఇద్దరు సభ్యులు బోర్ హోల్ ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌ల వద్ద పరిశీలన పనులు ఈ నెల 22న ప్రారంభం కానున్నాయని తెలిపారు.ఈ మూడు బ్యారేజ్‌ల పునరుద్ధరణ డిజైన్లు నెల వ్యవధిలో రూపొందించాలని ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు పొందేందుకు మరింత ఒత్తిడి పెంచాలన్నారు.

అనుమతులపై కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి ఇప్పటికే తీసుకొచ్చామని, సీఎంతో చర్చించిన తరువాత పీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు మట్టి, ఇసుక మేటలతో నిండిపోయి నీటి నిలువ సామర్థ్యం తగ్గిపోతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ప్రాజెక్టులలో పూడికతీత పనులకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. ప్రత్యేకంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరుసగా వరదలతో మట్టి, ఇసుక వచ్చి చేరుతుండడంతో 112 టీఎంసీల సామర్థ్యం కాస్త 90 టీఎంసీలకు పడిపోయిందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తోసుకోవాలని అధికారులకు సూచించారు.

Next Story