బెట్టింగ్ యాప్‌లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

by Muthe.Rajitha |

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై నియంత్రణకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలనం తీర్పును వెలువరించింది.

బెట్టింగ్ యాప్‌లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై నియంత్రణకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలనం తీర్పును వెలువరించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ను నిషేధిస్తూ తీసుకొచ్చిన చట్టాల రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును ఇచ్చింది. ఈ ల్యాండ్‌మార్క్ జడ్జిమెంట్ ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బగా మారనుంది. ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బు పెట్టి ఆడడాన్ని నిషేధిస్తూ తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు చేసిన చట్టాలు పూర్తిగా చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఈ చట్టాలను కొట్టివేస్తూ మద్రాస్, కర్ణాటక హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ధర్మాసనం రద్దు చేసింది.

రమ్మీ, పోకర్ లేదా ఫాంటసీ స్పోర్ట్స్ వంటివి సాంకేతికంగా 'గేమ్స్ ఆఫ్ స్కిల్' అయినప్పటికీ.. ఒకసారి వాటిపై డబ్బులు పణంగా పెట్టి, తెలియని ఫలితం కోసం ఆశపడితే అది ఖచ్చితంగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కిందికే వస్తుందని కోర్టు తేల్చిచెప్పింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి కార్యకలాపాలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(g) కింద వ్యాపారం చేసుకునే ఎలాంటి ప్రాథమిక హక్కు లేదని కోర్టు స్పష్టం చేసింది. ఇవి సమాజానికి హానికరమైనవని పేర్కొంది. ఆన్‌లైన్ గేమింగ్ అడిక్షన్ కారణంగా యువత తీవ్ర ఆర్థిక నష్టాలు పాలవ్వడం, డిప్రెషన్‌కు గురికావడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటి తీవ్ర సామాజిక సమస్యలను కోర్టు ప్రస్తావించింది. ఇలాంటి వాటిని నిషేధించే పూర్తి శాసన అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు Entry 34 - State List కింద ఉన్నాయని తెలియజేసింది.

ఈ తీర్పు ద్వారా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రియల్ మనీ గేమింగ్ మరియు బెట్టింగ్ యాప్‌లపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పూర్తి లీగల్ బ్యాకింగ్ లభించింది. జంగ్లీ గేమ్స్ వంటి పెద్ద కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా, సుప్రీంకోర్టు ఇదే బెంచ్‌లో ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం విధించిన 28% జీఎస్టీ (GST) విధింపును కూడా సమర్థించింది. రాష్ట్రాల నిషేధ చట్టాలు ఒకవైపు, భారీ పన్నుల భారం మరోవైపు కావడంతో భారతదేశంలో రియల్ మనీ గేమింగ్ రంగం మనుగడే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ తీర్పు స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలు కూడా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై పూర్తి నిషేధం విధించేందుకు మార్గం సుగమమైంది.

Next Story