అయోధ్య వివాదంపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

by Malleboina Mahesh |

అయోధ్య రామ్ మందిర్ ట్రస్ట్ అక్రమాలపై విచారణ పిటిషన్.. తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ.. జూన్ 29న ప్రస్తావించాలని ఆదేశం!

అయోధ్య వివాదంపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
X

దిశ, వెబ్ డెస్క్: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో భారీ ఎత్తున ఆర్థిక అక్రమాలు (Financial Irregularities)జరిగినట్లు సిట్ గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఈ అక్రమాలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. ఈ పిటిషన్‌ను అర్జంట్ లిస్టింగ్‌లోకి చేర్చి తక్షణమే విచారణ చేపట్టాలన్న న్యాయవాది అభ్యర్థనను (Mentioning) అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ అంశాన్ని జూన్ 29న మరోసారి ప్రస్తావించాలని (Mention) సదరు న్యాయవాదికి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

ట్రస్ట్‌కు సంబంధించిన నిధుల వినియోగం, భూముల కొనుగోలు వ్యవహారాల్లో పారదర్శకత లోపించిందని, దీనిపై ఒక స్వతంత్ర కమిటీ - కోర్టు పర్యవేక్షణలో లోతైన దర్యాప్తు జరగాలని పిటిషనర్ తన దరఖాస్తులో పేర్కొన్నారు. అయితే, న్యాయస్థానం వేసవి సెలవుల అనంతరం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో.. జూన్ 29న ఈ పిటిషన్‌ను లిస్టింగ్ చేయడంపై తుది నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది. ఈ హై ప్రొఫైల్ కేసుపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

Next Story