- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాస్‌పోర్ట్-పౌరసత్వ వివాదం.. ప్రభుత్వం, చట్టం ఏమి చెబుతోంది?
పాస్‌పోర్ట్ పౌరసత్వానికి నిరూపణ కాదన్న కేంద్రం చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఈ అంశంపై రాజకీయ వివాదం మొదలు కావడంతో కేంద్రం తాజాగా మరోసారి స్పందించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వానికి ఫ్రూప్ కాదని కేంద్రం చేసిన ప్రకటన దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటనపై విపక్షాలు, ఇతర వర్గాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్రం గురువారం మరో ప్రకటన చేసింది. పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదని తీసుకున్న నిర్ణయం నిన్నటికి నిన్న తీసుకున్నది కాదని చాలా దశాబ్దాలుగా చట్టపరంగా ఇదే స్థితి కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇస్తూ 'పాస్‌పోర్ట్ చట్టం, 1967' లోని సెక్షన్ 20ని ఉదహరించింది. సెక్షన్ 20 ప్రకారం పౌరులు కాని వారికి (Non-citizens) కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ లేదా ప్రయాణ పత్రాలను జారీ చేయవచ్చని చట్టంలోనే ఈ నిబంధన ఉండటం వల్ల, కేవలం పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తిని భారత పౌరుడిగా ఖరారు చేయలేమని ప్రభుత్వం వివరించింది. అలాగే పాస్‌పోర్ట్ కలిగి ఉండటం పౌరసత్వాన్ని నిరూపించదని 2013 నాటి బాంబే హైకోర్టు తీర్పు కూడా స్పష్టం చేసిందని కేంద్రం గుర్తుచేసింది.
ప్రతిపక్షాల విమర్శలు..
పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) నిర్వహించిన వివరణాత్మక సమావేశంలో పాస్‌పోర్ట్ అనేది ప్రధానంగా ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని, దానిని పౌరసత్వానికి రుజువుగా పరిగణించరాదని చేసిన ప్రకటన రాజకీయ దుమారం రేపింది. దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయగా పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు ఇలా ప్రభుత్వం జారీ చేసినవేవి సిటిజన్ షిప్ నిరూపించేందుకు ప్రామాణికం కాదని గతంలో చెప్పగా అదే దారిలో ఇప్పుడు పాస్ పోర్టు కూడా చేరిపోయిందని మరి ఈ దేశంలో పౌరసత్వానికి రుజువు మరేంటని? ప్రశ్నిస్తున్నారు. ఆదిథ్య థాక్రే, కపిల్ సిబల్, జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్, కవి జావీద్ అక్తర్ వంటి వారు ప్రభుత్వ ప్రకటనపై విమర్శలు గుప్పించారు.
ఇది కొత్త పాలసీ కాదు: బీజేపీ
విపక్షాల విమర్శలపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందిస్తూ విదేశాంగ శాఖ ఎలాంటి కొత్త విధానాన్ని ప్రకటించలేదని, కేవలం చట్టపరంగా ఉన్న పాత నిబంధననే పునరుద్ఘాటించిందని చెప్పారు.భారతదేశంలో పౌరసత్వాన్ని కేవలం ఒకే ఒక్క పత్రం ఆధారంగా కాకుండా.. 'పౌరసత్వ చట్టం, 1955' ప్రకారం నిర్ధారిస్తారని ఆయన పేర్కొన్నారు. బర్త్ సర్టిఫికెట్లు, తల్లిదండ్రుల పౌరసత్వ రికార్డులు, స్కూల్ సర్టిఫికెట్లు, ఓటర్ లిస్ట్ ఎంట్రీలు, ల్యాండ్ రికార్డులు మరియు పాస్‌పోర్ట్ వంటి వివిధ ప్రభుత్వ అధికారిక పత్రాల కలయిక ద్వారానే పౌరసత్వం స్థాపించబడుతుందని వివరించారు. అయితే రాజకీయంగా రేగిన ఈ పౌరసత్వం వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.






