విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

by Ratna Kumari |

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం సబ్‌డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
X

దిశ, కొత్తగూడెం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం సబ్‌డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం మాదకద్రవ్యాల నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు భారీ ర్యాలీ చేపట్టగా, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన మాదకద్రవ్యాల నిర్మూలన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, డ్రగ్స్ వినియోగం సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మత అని, దాని నిర్మూలనకు ప్రతి పౌరుడు పోలీసులతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, స్నేహితుల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై దృష్టి సారించాలని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, ఓటీపీ మోసాలు, ఆన్‌లైన్ ట్రేడింగ్, సోషల్ మీడియా మోసాలపై అవగాహన కల్పించారు. అలాగే మహిళల భద్రత, రోడ్డు భద్రతా నియమాలు, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగంపై సూచనలు చేశారు. జిల్లాలోని విద్యాసంస్థలు, కళాశాలల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో సుమారు 1,500 మంది విద్యార్థులు పాల్గొని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కమాండెంట్ పిసివి రమణ, కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story