పాడుబడ్డ కార్యాలయంలో పని చేసేదెలా..!

by Jakkula.Mamatha |

ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కృషితో సమీకృత కలెక్టరేట్ కార్యాలయం మొట్టమొదటిసారిగా ఇక్కడే నిర్మించారు.

పాడుబడ్డ కార్యాలయంలో పని చేసేదెలా..!
X

దిశ, సంగారెడ్డి: ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కృషితో సమీకృత కలెక్టరేట్ కార్యాలయం మొట్టమొదటిసారిగా ఇక్కడే నిర్మించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి జిల్లాకు సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు వచ్చాయి. అయితే దాదాపు దశాబ్దాలు గడుస్తున్నా కూడా ఇక్కడ సంగారెడ్డి తాసిల్దార్ కార్యాలయం మాత్రం ఇంకా పాడుబడ్డ భవనంలోనే కొనసాగుతుండడం శోచనీయం. జిల్లా కలెక్టర్ ఇతర జిల్లా అధికారులు అందరూ ఇక్కడే ఉన్నా కూడా ఎమ్మార్వో ఆఫీస్ పురాతన భవనంలో కొనసాగడం పట్ల స్థానికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. 1910 సంవత్సరంలో నిర్మించిన అతి పురాతనమైన భవనంలోనే ప్రస్తుతం తహసిల్దార్ కార్యాలయానికి చెందిన రికార్డ్ సెక్షను, ఇతర విభాగాలు ఇక్కడే తమ విధులు కొనసాగిస్తున్నాయి.

ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో సైతం సరికొత్త భవనాల్లో మండల ఆఫీసులు ఏర్పాటు అవుతుంటే, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మాత్రం ఇలాంటి పరిస్థితి ఉండడం పట్ల స్థానికులు తమ విమర్శలను గుప్పిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం మొదలైన నేపథ్యంలో ఈ పురాతన భవనం ఎప్పుడు కూలుతుందో అన్న విధంగా ఉండటంతో అక్కడ విధులు నిర్వహించే కార్యాలయ సిబ్బంది బిక్కుబిక్కుమంటూ పని చేస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇంత తెలిసినా కూడా జిల్లా అధికారులకు కనీసం పట్టింపు లేకపోవడం విడ్డూరం. ఇదే విషయమై తాసిల్దార్ జయరామ్ ను దిశ వివరణ కోరగా నాలుగు సంవత్సరాలు క్రితం ఇక్కడ ఉన్న పురాతన కార్యాలయాలు అన్ని కూలగొట్టి వాటి స్థానంలో కొత్తగా ఓకే భవనంలో ఆర్డీవో కార్యాలయంతో పాటు తహసీల్దార్ కార్యాలయం కట్టేందుకు శంకుస్థాపన చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి తహసిల్దార్ కార్యాలయానికి కొత్త భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు, అక్కడి సిబ్బంది కోరుతున్నారు.

Next Story