- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సుచిర్-వాసవి’ ధిక్కారం!
అక్రమ నిర్మాణాలు ఆపాలని ప్రభుత్వంలోని పలు శాఖలు నోటీసులిచ్చిన ‘సుచిర్-వాసవి’ డెవలపర్లు లెక్క చేయడం లేదు.

దిశ, మేడ్చల్ బ్యూరో: అక్రమ నిర్మాణాలు ఆపాలని ప్రభుత్వంలోని పలు శాఖలు నోటీసులిచ్చిన ‘సుచిర్-వాసవి’ డెవలపర్లు లెక్క చేయడం లేదు. ఇరిగేషన్ శాఖ ‘ఎన్ఓసీ’ రద్దు చేయడం, హెచ్ఎండీఏ షోకాజ్ నోటీసులు జారీ, రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఆదేశించినా ‘సుచిర్ ఇండియా-వాసవి నిర్మాణ్’ డెవలపర్లు మాత్రం చట్టాన్ని, అధికారుల ఆదేశాలను బొత్తిగా పట్టించుకోవడం లేదు. చట్టపరంగా జారీ చేసిన నోటీసుల గడువు ముగిసినా ఇప్పటికీ వెంచర్‌లో నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతుండటం చూస్తుంటే డెవలపర్లకు ఏ మాత్రం భయం లేదని అర్థమవుతుంది.
అధికారిక ఆదేశాలు అపహాస్యం..
ఇరిగేషన్ శాఖ జారీచేసిన ఎన్ఓసీ రద్దు ఉత్తర్వుల లేఖ నం. SE/IC/HYD/DSE/DEE-I/TS-2/NOC/F-37/Vasavi Nirman/2388 (తేదీ: 24-11-2025), మున్సిపల్ అధికారులు పంపిన షోకాజ్ నోటీసులు లేఖ నం.G1/TPS/KSR/GHMC/15/2025 (తేదీ : 20-01-2026) .. ఈ వెంచర్ యజమానులకు కేవలం కాగితపు ముక్కల్లాగే కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని, నాళాలను పునరుద్ధరించాలని అధికారులు హెచ్చరించారు. అయినా, డెవలపర్లు మాత్రం తమ నిర్మాణాలను ఏ మాత్రం ఆపడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంటే, డెవలపర్లు మాత్రం తమ ‘అక్రమ దందా’ను ఏమాత్రం ఆపకుండా కొనసాగిస్తున్నారు. నిర్మాణాలు, రిజిస్ట్రేషన్స్ నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ డెవలపర్లు ఏ మాత్రం జంకకుండా ముందుకు వెళ్తున్నారు.
వ్యవస్థల పట్ల గౌరవం ఏది?
చట్టాన్ని ధిక్కరించడమే కాకుండా హెచ్ఎండీఏ, ఇరిగేషన్ శాఖ వంటి కీలక ప్రభుత్వ సంస్థల ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారు. ‘మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అన్నట్టుగా వారి ప్రవర్తన ఉండటం, పారదర్శకమైన వ్యవస్థకు సవాల్‌గా మారింది. అక్రమంగా నిర్మించిన క్లబ్ హౌస్, ఆక్రమించిన చెరువు బఫర్ జోన్ భూములను తొలగించాలని కోరితే, డెవలపర్లు కొత్తగా వాదనలు వినిపిస్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప, నిబంధనలను పాటించే ప్రయత్నం చేయడం లేదు. మొత్తానికి ‘సుచిర్-వాసవి’ లే అవుట్‌లో చర్యలు తీసుకునే ధైర్యం చేయకపోవడంలో అధికారుల నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తోంది.
జవాబుదారీతనం ఏది?
అధికారులు గడువు ఇస్తూనే ఉన్నారు. డెవలపర్లు ఆ గడువును దాటేస్తూనే ఉన్నారు. ఈ ‘రియల్’ గేమ్‌లో నష్టపోతున్నది సామాన్య కొనుగోలుదారులే. అక్రమ నిర్మాణాలకు అండగా నిలబడుతున్న డెవలపర్ల ధీమా వెనుక ఉన్న శక్తులు ఏవి? అన్నది ఇప్పుడు స్థానికంగానే కాకుండా రియల్ ఎస్టేట్ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. చట్టం కంటే సంస్థలు గొప్పవా? అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మొదలైంది. చట్టాన్ని అమలు చేయడంలో అధికారులు కేవలం నోటీసులకే పరిమితం కాకుండా ఇప్పటికైనా డెవలపర్లపై కఠిన చర్యలు తీసుకుని, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని.. చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. లేనియెడల చట్టాన్ని గౌరవించే వారికి ఈ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుందని చెబుతున్నారు.






