- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పన్నెండేళ్లు ఒకే చోట చదువా?
ప్రభుత్వం ఇంటర్ విద్యను రద్దు చేసి ఉన్నత పాఠశాలలో కలిపి ప్లస్ 2 విధానాన్ని అమలు చేయాలని చూస్తుంది.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నియమించిన తెలంగాణ విద్యా కమిషన్ ఇంటర్మీడియట్ విద్యను రద్దు చేసి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) మాదిరి క్లాస్ 11,12 (ప్లస్2) విద్యా విధానాన్ని పాఠశాల విద్యలో భాగంగా నిర్వహించాలని తద్వారా విద్యార్థుల డ్రాప్ ఔట్స్ తగ్గుతాయని సిఫార్సు చేసింది. ఆ సిఫారసు మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్లస్ 2 విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టడానికి ప్రయత్నించింది.
కానీ చివరి నిమిషంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వివిధ సాంకేతిక అంశాలను, సవాళ్లు, ప్రతిసవాళ్లు బేరీజు వేసుకొని చివరి నిమిషంలో వాయిదా వేయడం జరిగింది. సీబీఎస్ఇఈ అమలు తుది నిర్ణయం కూలంకుషంగా నిపుణులతో చర్చించి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ఇంటర్ అడ్మిషన్లు యథావిధంగా జరుగనున్నవి.
ప్లస్ 2 విధానం మంచీ చెడూ..
ప్రభుత్వం ఇంటర్ విద్యను రద్దు చేసి ఉన్నత పాఠశాలలో కలిపి ప్లస్ 2 విధానాన్ని అమలు చేయాలని చూస్తుంది. ఈ అంశాన్ని మానసిక నిపుణులు, విద్యావేత్తలతో అధ్యయనం చేశాక అమలు చేయాలి. సిబిఎస్ఇ విధానం వాటి లోటుపాట్లు కూడా అధ్యయన చేయాలి. ఇంటర్ బోర్డును రద్దు చేసి ప్లస్ 2 విధానాన్ని పాఠశాల విద్యలో కలిపివేయడంలో విద్యార్థుల మానసిక అభివృద్ధికి, అలాగే సర్వతోముఖాభివృద్ధి (ఆల్ రౌండ్ డెవలప్మెంట్)కి అవరోధం కలిగే అవకాశాలు ఉన్నాయి.
ఒకే గ్రామంలో పదేళ్లపాటు చదువు..
స్వాతంత్ర్యానంతరం దాదాపు ఈ డెబ్బై యేడేళ్ల కాలంలో మన దేశంలో ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలు లేదా మాధ్యమిక పాఠశాలలు దాదాపు అందరికీ తాము పుట్టిన ఊరిలో లేదా నివసించే చోటున లభించే అవకాశాలు ఉన్నాయి. పట్నంలోనైనా పల్లెలోనైనా విద్యార్థి ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు దాదాపు అదే గ్రామంలో లేదా అదే పాఠశాలలో చదివే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఇంటర్ విద్య కూడా ప్రతి గ్రామంలో లేదా అదే పాఠశాలలో అందుబాటులోకి తీసుకురావాలనే ప్రభుత్వ సంకల్పం కొంత మేర మంచిదే అయినా దాదాపు ఒకే బ్యాచ్ తోటి విద్యార్థులతో ప్రయాణం చేయడం వల్ల విద్యార్థి మానసిక ఎదుగుదల, పరిపక్వతపై ప్రభావం చూపవచ్చు. బయటి ప్రపంచాన్ని సరిగ్గా అధ్యయనం చేసే అవకాశాలు కోల్పోవచ్చు.
మానసిక వికాసానికి కొత్త పరిసరాలు అవసరం
అలాంటి పరిస్థితిలో నీవు ఇంకో రెండేళ్లు అక్కడే చదవాలి అంటే ఒకరకమైన నిరుత్సాహం విద్యార్థుల్లో పురుడుపోసుకునే అవకాశం ఉంది.. ప్లస్ 2 విద్య కోసం వేరే కళాశాలకు వెళ్ళే అవకాశం ఉన్నప్పటికినీ తల్లి తండ్రులు అక్కడే చదివించడానికి మొగ్గు చూపుతారు. మానసికి వికాసానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొంత మేర కొత్త పరిసరాలు కూడా అవసరం. కొత్త ఛాలెంజెస్ కూడా అవసరం. పరిస్థితులు, అవసరాలు మనిషిని అన్వేషణ వైపు నడిపిస్తాయి. ఒక విద్యార్థి ఏక ధాటిగా ఒకే ప్రదేశంలో, ఒకే పాఠశాలలో, ఒకే మిత్ర బృందంతో దాదాపు 12 యేండ్లు ఒక పుష్కర కాలం గడిపితే ఆ విద్యార్థి వికాసానికి, మానసిక ఎదుగుదలకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.. కొత్త పరిసరాలు, కొత్త అవసరాలు, కొత్త స్నేహితులు తప్పనిసరిగా విద్యార్థి మానసిక పరిపక్వతకు, ఉల్లాసానికి దోహదపడుతాయి.
ప్రపంచం కూపస్త మండూకం కారాదు
ఇంటర్ విద్య కోసం పొరుగున ఉన్న పట్టణానికి లేదా నగరానికి పంపి హాస్టల్‌లో ఉంచడం వల్ల వారికి కొంత మేర స్వేచ్ఛ లభిస్తుంది. ఆ స్వేచ్ఛ ఎటువైపు దారి తీస్తుందోననే భయం తల్లితండ్రుల్లో ఉండడం సహజం. అలా అని ఒకే పరిసరాలు, మిత్రుల మధ్య పెరగడం కూపస్త మండూకం (బావిలో కప్పలా) అదే ప్రపంచం అయిపోతుంది. ఇటీవల ఒక విద్యార్థిని కూపస్థ మండూకం అంటే ఏమిటో చెప్ప లేక పోయింది. ఈసురోమనీ మనుష్యులంటే...గేయం ముందు చరణం ఏమిటో చెప్పలేదు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుష్యులోయ్ అన్నదెవరో తెలియదు. చివరికి వందేమాతరం పదేళ్లుగా చదివావు కదా ఎవరు రాశారు అంటే చెప్పలేదు..
అందరూ డాక్టర్లు, ఇంజనీర్లేనా?
ఇంటర్ విద్యను పటిష్టం చేయాలి. ఇంటర్లో విద్యార్థి అభిరుచి మేరకు ఆయా కోర్సులను ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ తల్లి తండ్రుల ప్రమేయం ఉండకూడదు. వారి ఇష్టాయిష్టాలను బలవంతంగా పిల్లలపై రుద్దకూడదు. ఇటీవల ఎందరో విద్యార్థులు ఇష్టం లేని కోర్సులు చేస్తూ..సరిగా రాణించలేక ఆత్మ హత్యలకు పాల్పడుతూ తల్లితండ్రులకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు.అందరు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కోరుకునే తల్లితండ్రులే ఎక్కువ. కానీ సమాజంలో ఎన్నో వృత్తులు ఉన్నాయి. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన మానసిక ఒత్తిడికి గురిచేయడం సరికాదు.
నూటికి తొంభై తొమ్మిది.. భ్రమ వద్దు
అసలు నూటికి తొంభై తొమ్మిది రావాలి అనే భ్రమను మనసు నుండి తొలగించాలి. బట్టీ చదువులు MBBS, , NIT, IIT ల్లో సీట్లు తెప్పించవచ్చు కానీ రాణించలేక చతికిల పడుతున్న విద్యార్థులు ఎందరో ఉన్నారు. ఐఐటీ, జేఈఈ లలో పర్సంటైల్ విధానాన్ని పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కన్న ఇతర రాష్ట్రాల విద్యార్థులకు తక్కువ పర్సంటైల్ ఉన్నా ఆయా రాష్ట్రాల్లో సీట్లు సాధిస్తున్నారు. మన వాళ్ళు తొంభై ఐదు పర్సంటైల్ ఉన్నా సీటు పొందలేక పోతున్నారు. మార్కుల వేట మాని మనిషిగా తీర్చి దిద్దే, సంస్కారాన్ని నేర్పే చక్కటి, చిక్కటి చదువులు కావాలి. ఇంటర్ విద్యా విధానం వల్ల CBSE కన్నా కొన్ని మెరుగైన అంశాలు ఉన్నాయి. సీబీఎస్ఈ సిలబస్ అమలు ఇంటర్ విద్యను నిపుణులతో అధ్యయనం చేసి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి.
శిరందాస్ శ్రీనివాస్
ప్రిన్సిపాల్
ఆరోగ్య సంరక్ష & అనుబంధ వృత్తుల కళాశాల
నిజాం వైద్య విజ్ఞాన సంస్థ
94416 73339






