ఉస్మానియా క్యాంపస్‌లో విద్యార్థిని తల్లికి అవమానం.. రాత్రి నుంచి కొనసాగుతున్న నిరసన

by Malleboina Mahesh |

హైదరాబాద్‌లోని ఉస్మానియా క్యాంపస్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యావంతులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీ (OU) హాస్టల్‌లో హాస్టల్ సిబ్బంది కర్కషత్వం తో మానవత్వం మంటగలిసింది.

ఉస్మానియా క్యాంపస్‌లో విద్యార్థిని తల్లికి అవమానం.. రాత్రి నుంచి కొనసాగుతున్న నిరసన
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని ఉస్మానియా క్యాంపస్ (Osmania Campus లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యావంతులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీ (OU) హాస్టల్‌లో హాస్టల్ సిబ్బంది కర్కషత్వం తో మానవత్వం మంటగలిసింది. తన బిడ్డను చూడటానికి వచ్చిన ఒక తల్లిని కనీసం రాత్రి వేళ కూడా ఉండనివ్వకుండా, హాస్టల్ సిబ్బంది బయటకు గెంటేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో యాజమాన్యం ప్రవర్తించిన తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విద్యార్థినులు రాత్రి నుండే రోడ్డుపైకి వచ్చి భారీ నిరసన చేపట్టారు. అధికారుల తీరుపై వర్సిటీలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయం ఇదే

ఒక విద్యార్థినిని చూడటానికి ఆమె తల్లి గ్రామం క్యాంపస్‌లోని హాస్టల్‌కు వచ్చారు. పనులు ముగిసేసరికి రాత్రి కావడంతో, ఆ సమయంలో ఇంటికి వెళ్లడం ఇబ్బందిగా భావించి, ఆ రాత్రికి హాస్టల్‌లో ఉండి మరుసటి రోజు ఉదయం వెళ్తానని సిబ్బందిని కోరారు. అయితే అందుకు హాస్టల్ యాజమాన్యం ఏమాత్రం కనికరం లేకుండా నిరాకరించింది. "ఇక్కడ ఉండటానికి వీల్లేదు.. ఇప్పుడే వెళ్ళిపోవాల్సిందే" అంటూ సదరు మహిళను అందరి ముందు అవమానించారు. తన తల్లి రాత్రి వేళ ఒంటరిగా ఎక్కడికి వెళ్తుందని విద్యార్థిని కన్నీళ్లతో వేడుకున్నా, సిబ్బంది మాత్రం మొండిగా ప్రవర్తించి ఆమెను బయటకు పంపే ప్రయత్నం చేశారు.

సిబ్బంది తీరుతో రోడ్డెక్కిన విద్యార్థినిలు

బిడ్డ కోసం వచ్చిన తల్లికి జరిగిన అవమానం, సిబ్బంది అమానవీయ ప్రవర్తన గురించి తెలియడంతో హాస్టల్ విద్యార్థినులంతా ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. రాత్రి సమయం అని కూడా చూడకుండా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. "మా తల్లిదండ్రులకు గౌరవం లేని చోట మేం ఎలా ఉండాలి?" అంటూ నిలదీశారు. విద్యార్థిని తల్లికి జరిగిన అవమానానికి బాధ్యులైన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, హాస్టల్ నిబంధనల పేరుతో మహిళలను ఇబ్బంది పెట్టడం ఆపాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి ప్రారంభమైన నిరసన, గురువారం ఉదయం కూడా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇతర హాస్టల్ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు కూడా ఈ నిరసనకు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో ఉస్మానియా క్యాంపస్‌లో పరిస్థితి ఉద్రిక్తంగాఉండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. వర్సిటీ వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

Next Story