అమావాస్య ఎఫెక్ట్.. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు

by Jakkula.Mamatha |

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ, మొదటి రోజే విద్యార్థుల హాజరు శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.

అమావాస్య ఎఫెక్ట్.. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు
X

దిశ, ఖమ్మం రూరల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ, మొదటి రోజే విద్యార్థుల హాజరు శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. తీవ్ర ఎండల కారణంగా పాఠశాలల ప్రారంభాన్ని కొన్ని రోజులు వాయిదా వేసిన ప్రభుత్వం, విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, పాఠశాలలు తెరుచుకున్న తొలి రోజునే అమావాస్య రావడం హాజరు పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అమావాస్య రోజు పిల్లలను కొత్త కార్యక్రమాలకు పంపడం మంచిది కాదనే నమ్మకంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గినట్టు సమాచారం. కొన్నిచోట్ల 10 నుంచి 20 శాతం మధ్యే హాజరు నమోదైందని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రాథమిక తరగతుల విద్యార్థుల హాజరు మరింత తక్కువగా కనిపించింది. మొదటి రోజు కావడం, వర్షాకాలం ప్రారంభ దశలో వాతావరణ మార్పులు, అమావాస్య సెంటిమెంట్ వంటి కారణాలు కలిసి హాజరు పై ప్రభావం చూపినట్లు విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, రానున్న రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని, ముఖ్యంగా ఈ 17 తర్వాత విద్యార్థుల హాజరు శాతం క్రమంగా పెరిగే అవకాశముందని ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తం మీద, రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల తొలి రోజున “అమావాస్య ఎఫెక్ట్” స్పష్టంగా కనిపించిందని చెప్పవచ్చు.

Next Story