భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు భేటీ

by Naga Rani Yarlagadda |

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా సోమవారం సింగపూర్ లో ఉన్న భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ అయ్యారు.

భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా సోమవారం సింగపూర్ లో ఉన్న భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ అయ్యారు. భారత్ తో సింగపూర్ కు ఉన్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలను శిల్పక్ అంబులే సీఎం కు వివరించారు. అలాగే ఏపీ అభివృద్ధిలో సింగపూర్ కీలకమైన పార్టర్న కావాలని సీఎం ఆకాంక్షించారు. ఇందుకోసం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవిధంగా సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో, సెమీ కండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో అనుకూలతలను సీఎం వివరించారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం విషయంలో కొత్త లక్ష్యాలను సాధిస్తున్నామని, 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు రైతులు ముందుకొచ్చారని తెలిపారు. రోబోటిక్స్, మెడికల్ డివైజెస్, హార్డ్వేర్ రంగాల్లో సింగపూర్ సహకారం రాష్ట్రానికి కావలసి ఉందన్నారు. ఏపీ యువత సింగపూర్ టెక్ రంగంలో అవసరాలను తీర్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.

ఏపీ అభివృద్ధికి సహకరించండి..

స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు భారత్ నిద్రపోతున్న ప్రాంతం కాదు.. సంస్కరణలతో దూసుకుపోతున్న అతి పెద్ద ఆర్ధికశక్తి అని అభివర్ణించారు. ప్రధాని మోదీ లాంటి ఆధునిక ఆలోచనలు ఉన్న వ్యక్తి దేశాన్ని ఓ అద్భుతమైన వేగంతో అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. చైనా లాంటి దేశాలు ఆర్ధిక అభివృద్ది సాధించటానికి దశాబ్దాల కాలం పట్టింది కానీ భారత్‌కు అంత సమయం పట్టటం లేదని, అంతకంటే తక్కువ సమయంలోనే ఆర్ధికంగా అభివృద్ధి చెందుతామన్నారు. "మెడికల్ టెక్నాలజీ సహా ఇతర ఆధునిక పరికరాల తయారీలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఇప్పుడు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయి. 5వ జనరేషన్ యుద్ధ విమానాల తయారీ సహా ఇతర ఉత్పత్తులు వస్తున్నాయి. డెమోగ్రాఫిక్ డివిడెంట్‌తో అతిపెద్ద యువశక్తి కలిగిన మానవ వనరులను భారత్ కలిగి ఉంది. తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా ఆంధ్రప్రదేశ్‌లో మేం వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే విధానాన్ని అనుసరిస్తున్నాం. భూ సమీకరణ అనే కొత్త విధానం ద్వారా ప్రాజెక్టులకు భూములు ఇస్తున్నాం. అమరావతి రాజధాని ఈ ప్రాతిపదికనే నిర్మిస్తున్నాం. ఆమ్కా, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చి భూములు కేటాయించాం. వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయం. పెట్టుబడిదారులు ముందుకు రావాలని పిలుపునిస్తున్నాను. శ్రీసిటీ లాంటి ప్రత్యేక పారిశ్రామిక వాడలు పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నాయి. పౌర సేవలతో పాటు అన్ని అంశాలకూ టెక్నాలజీని అనుసంధానించాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పెట్టుబడులకు ఆస్కారం ఉంది.

వెంచర్ కాపిటలిస్టులు ఆ సంస్థ తయారు చేసిన స్టార్టప్‌లకు పెట్టుబడులు అందించే అవకాశం ఉంది. అత్యుత్తమ ఆవిష్కరణల్ని ప్రోత్సహించేందుకు వెంచర్ కాపిటలిస్టులు ముందుకు రావాలని కోరుతున్నాను." అని సీఎం పేర్కొన్నారు.

Next Story