పాలసీలు చేయాల్సిన సీఎం, డిప్యూటీ సీఎంలే వినతి పత్రాలిస్తున్నారు: కవిత

by Prasad Jukanti |

కాంగ్రెస్ పాలనలో సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతోందని, బకాయిలు రూ.50వేల కోట్లు వెంటనే చెల్లించాలని TRS అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.

పాలసీలు చేయాల్సిన సీఎం, డిప్యూటీ సీఎంలే వినతి పత్రాలిస్తున్నారు: కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధారణంగా జరగాల్సిన పనులకు కూడా పోరాటం చేయాల్సి వస్తోందని.. హైదరాబాద్, ఢిల్లీలో ఉండి మనకు బొగ్గు బావులు తేవాల్సిన సీఎం, డిప్యూటీ సీఎంలు వినతి పత్రాలిస్తూ సింగరేణి కార్మికులను మభ్య పెడుతున్నారని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) విమర్శించారు. డిపెండెంట్ ఉద్యోగాలతో సహా అన్నింటిలో కార్మికులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టాల్సిన ప్రభుత్వం నిలిపివేసిందని దుయ్యబట్టారు. బొగ్గుబాయి కార్యక్రమంలో భాగంగా ఇవాళ కాసిపేట మైన్-1 పరిశీలించిన కవిత ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయండి:

ఓపెన్ కాస్ట్ మైనింగ్ పెంచే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం… సింగరేణి కార్మికుల భద్రతను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. డిపెండెంట్ ఉద్యోగాలతో సహా అన్నింటిలో కార్మికులకు అన్యాయం చేస్తున్నారన్నారు. మనకు ఐటీ సమస్య లేకుండా, నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టాల్సిన పనులు ఈ ప్రభుత్వం చేయడం లేదన్నారు. హక్కుగా రావాల్సిన డిపెండెంట్ ఉద్యోగాల కోసం పోరాటం చేయాల్సి ఉందని సింగరేణికి బొగ్గు బావులు తెచ్చుకుంటే దాదాపు లక్ష ఉద్యోగాలు ఇవ్వవచ్చన్నారు. కానీ అన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలని, అండర్ గ్రౌండ్ మైనింగ్‍ను రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సింగరేణిని కాపాడాలనే చిత్తశుద్ది ఈ ప్రభుత్వానికి ఉంటే సింగరేణికి బకాయి ఉన్న రూ.50 వేల కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు బాయి బాట కార్యక్రమం ఉంటుందని కాసిపేట నుంచే బాయిబాట కార్యక్రమం మొదలుపెట్టామన్నారు. కార్మికుల పిల్లలు చదువుకునేందుకు సరైన స్కూల్స్, సరైన హాస్పిటల్స్ లేవని అన్నింటిల్లో ప్రైవేట్ ను తీసుకొచ్చి వైద్యాన్ని మరింత ఖరీదు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందుకే తెలంగాణ రక్షణ సేన పాంచజన్యం అనే ఐదు కీలక అంశాలతో ముందుకు వచ్చిందని కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా మేము అందజేస్తామన్నారు.

తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా వచ్చాం:

తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా వచ్చామని టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత సింగరేణిలో నా మొదటి యాత్ర ఇదేనన్నారు. సింగరేణి బిడ్డల ఆశీర్వాదం కోసం ఇక్కడకు వచ్చినట్లు కవిత తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశాం, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ కలిసి పనిచేశామని నేను ఎక్కడ ఉన్న కూడా అనునిత్యం మీ పక్కనే ఉండి పోరాటం చేశానన్నారు. సింగరేణిలోని మెడికల్ బోర్డు పెట్టకపోతే హైదరాబాద్‍లోని సింగరేణి భవన్‍ను ముట్టడించామని గుర్తు చేశారు. టీఆర్ఎస్ కార్మికుల కోసం హెచ్ఎంఎస్‍తో కలిసి పోరాటం చేస్తుందని రానున్న ఏ ఎన్నికల్లోనైనా, పోరాటాల్లోనైనా హెచ్ఎంఎస్‍తో కలిసి టీఆర్ఎస్ సంయుక్తంగా పోరాడుతుందని చెప్పారు. కార్మికులకు హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. మా పార్టీకి సింగరేణి కార్మికుల దీవెనార్తి ఉండాలని కోరుకుంటున్నా.

Next Story