- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ బాలుర హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో పదో తరగతి విద్యార్థి గురువారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, వార్డెన్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.

దిశ, సదాశివనగర్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో పదో తరగతి విద్యార్థి గురువారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, వార్డెన్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. గాంధారి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాఘవేంద్ర అనే విద్యార్థి హాస్టల్‌లో పుస్తకాలు, ఇతర వస్తువులకు ఉపయోగించే రబ్బర్ బ్యాండ్లను మెడకు బిగించి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
ఈ విషయాన్ని గమనించిన హాస్టల్ వార్డెన్ సునీత వెంటనే స్పందించి విద్యార్థిని రక్షించి, తక్షణమే కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఉన్నతాధికారులతో పాటు విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సమయానికి వార్డెన్ స్పందించడంతో విద్యార్థి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆలస్యమై ఉంటే తీవ్ర విషాదం జరిగి ఉండేదని అధికారులు పేర్కొన్నారు. సమాచారం ప్రకారం, ఇటీవల విద్యార్థి మేనత్త మృతి చెందడంతో కొద్దిరోజుల పాటు స్వగ్రామంలో ఉన్నాడు. రెండు రోజుల క్రితమే తండ్రి హాస్టల్‌లో చేర్పించి చదువుపై దృష్టి పెట్టాలని చెప్పి వెళ్లినట్లు తెలిసింది. గురువారం రాత్రి వార్డెన్ నుంచి సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు.
విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఆస్పత్రికి చేరుకుని విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఘటనపై వార్డెన్ సునీత మాట్లాడుతూ, హాస్టల్‌లో ఉండడం ఇష్టం లేక విద్యార్థి ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని తెలిపారు. విద్యార్థిని సకాలంలో రక్షించి ప్రాణాలు కాపాడిన వార్డెన్ సునీతను ఉన్నతాధికారులు అభినందించారు.






