మాట నిలబెట్టుకున్న సీఎం.. తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు

by Naga Rani Yarlagadda |

గతేడాది కరూర్ లో విజయ్ పర్యటనలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

మాట నిలబెట్టుకున్న సీఎం.. తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది కరూర్ లో విజయ్ పర్యటనలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత తొలిసారి సీఎం హోదాలో విజయ్ కరూర్‌లో నిర్వహించిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి చొప్పున 32 మంది బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. సభలో వారందరికీ సీఎం విజయ్ నియామక పత్రాలను అందజేసి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గతేడాది సెప్టెంబరులో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని విజయ్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. వారిలో అర్హులైన వారికి ఉద్యోగాలు ఇచ్చారు.

అనంతరం విజయ్ మాట్లాడుతూ.. తొక్కిసలాటలో పిల్లలు ప్రాణాలు కోల్పోవడం తననెంతో బాధించిందన్నారు. ఆనాడు ర్యాలీ రద్దుకు ప్రభుత్వానికి అన్ని హక్కులున్నా.. పోలీసులు ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. తాను పోలీసులను నమ్మితే.. వారే తనపై నిందలు వేశారని వాపోయారు. నాడు సీఎంగా ఉన్న స్టాలిన్ తనపై నిందలు మోపేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.

తమిళనాడులో అన్ని విభాగాలను డీఎంకే దోపిడీ చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వంలో ఒక్కపైసా కూడా లంచానికి తావులేకుండా నిజాయితీగా పాలన అందిస్తున్నామన్నారు. తాను రాజకీయాల కోసం అన్నింటినీ వదులుకుంటే.. ఎన్నికల ద్వారా ప్రజలే అన్నీ తనకు తిరిగి ఇచ్చారని సీఎం విజయ్ పేర్కొన్నారు. డబ్బుకోసం తానెప్పుడూ ఆలోచించనని, ప్రజా సంక్షేమమే ముఖ్యమన్నారు. తనకోసం నిలబడిన ప్రజలను ఎన్నటికీ వదులుకోనని, రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ తమతోనే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story