టికెట్ అడిగినందుకు TTE పై దాడి

by Muthe.Rajitha |

టికెట్ చూపించమని అడిగినందుకు ఏకంగా టీటీఈ (TTE) పై దాడి చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

టికెట్ అడిగినందుకు TTE పై దాడి
X

దిశ,వెబ్ డెస్క్ : టికెట్ చూపించమని అడిగినందుకు ఏకంగా టీటీఈ (TTE) పై దాడి చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. చెన్నై ఎగ్మోర్‌ రైల్వే స్టేషన్‌లో లా స్టూడెంట్ మహిళా టీటీఈ ని కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్లాట్‌ఫామ్ టికెట్ అడిగినందుకు, విచారణ సమయంలో తన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నందుకు ఆగ్రహించిన విద్యార్థిని ఈ దారుణానికి ఒడిగట్టింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. శనివారం చెన్నై ఎగ్మోర్‌ రైల్వే స్టేషనుకు ఒక న్యాయ విద్యార్థిని తన బంధువుల కోసం రాగా.. అక్కడ విధుల్లో ఉన్న మహిళా టికెట్ ఎగ్జామినర్ ఆ విద్యార్థినిని ఆపి టికెట్‌ చూపించమని అడిగింది. దానికి ఆమె స్పందిస్తూ.. తాను రైలులో ప్రయాణించలేదని, తన బంధువుకు వీడ్కోలు చెప్పడానికి మాత్రమే స్టేషన్‌కు వచ్చానని తెలిపింది. కనీసం ప్లాట్ఫాం టికెట్ కూడా లేకపోవడంతో నిబంధనల ప్రకారం తదుపరి విచారణ నిమిత్తం సదరు విద్యార్థినిని టికెట్ ఎగ్జామినర్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు.

అక్కడ విచారణ జరుగుతున్న సమయంలో, అధికారులు ఆమె మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన న్యాయ విద్యార్థిని.. తన ఫోన్‌ను వెంటనే తిరిగి ఇచ్చేయాలని గట్టిగా డిమాండ్‌ చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. కోపంతో ఊగిపోయిన విద్యార్థిని అక్కడ విధుల్లో ఉన్న మహిళా టీటీఈపై ఒక్కసారిగా చేయి చేసుకుంది. అనంతరం ఒకరిపై ఒకరు దడి చేసుకొని రణరంగం సృష్టించారు. ఈ ఘటనపై ఎగ్మోర్ రైల్వే పోలీసులకు సమాచారం అందగా.. తక్షణమే అక్కడికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story